హైదరాబాద్ : పింగళి వెంకయ్య భారత ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన జాతీయ జెండా రూపకర్త. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జాతీయ జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మ చక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం కావడంతో జాతీయ పతాకంలో చేర్చారు.
మహాత్మాగాంధీ సమకాలికుల్లో ఒకరైన పింగళి 1876, ఆగస్టు 2న కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో జన్మించారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ఎన్నో జాతీయ పతాకాలు వినియోగించారు. కానీ పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31, ఏప్రిల్ 1 మధ్య విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఈ పతకానికి కొద్దిగా మార్పులు చేశారు. గాంధీ సూచన మేరకు దానిపై ‘రాట్నం’ గుర్తు చేర్చారు. స్వాతంత్య్రానంతరం నెహ్రూ సూచనమేరకు రాట్నం స్థానంలో అశోకచక్రం చేర్చారు.
ఏప్రిల్ 13, 1936 నాటి ‘యంగ్ ఇండియా’ పత్రికలో గాంధీజీ పింగళి వెంకయ్యను ప్రత్యేకంగా ప్రశంసించారు. 19 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ ఆర్మీలో చేరి ఆఫ్రికాలో ఆంగ్లో-బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే మహాత్మాగాంధీతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 50 ఏళ్ల పాటు అది కొనసాగింది. పింగళి వెంకయ్య సన్నిహితులు ఆయన్ను జపన్ వెంకయ్య, పత్తి వెంకయ్య, జనద వెంకయ్య అని పలు రకాలుగా పిలుచుకునేవారు.
ఆయన గొప్ప దేశభక్తుడు, జియాలజిస్ట్, రచయిత కూడా. 1911- 44 వరకు బందరు జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు చేసి డిప్లొమా పొందారు. 1924 నుండి 1944 వరకు నెల్లూరులో ఉండి మైకా గురించి పరిశోధనలు చేశారు…బొగ్గు వజ్రంగా మారే విధానాన్ని గురించి ‘తల్లిరాయి’ అనే పుస్తకం రాశారు. 1916లో ‘భారతదేశమునకు ఒక జాతీయ పతాకం’ అనే గ్రంథాన్ని ర చించారు. ఈ గ్రంథంలో సుమారు 30 రకాల పతాకాలను ప్రదర్శించారు.
1921లో బెజవాడలొ అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు జరిగినప్పుడు గాంధీజీ ఆదేశానుసారం త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు…గాంధీ సూచన మేరకు దానిపై రాట్నం గుర్తు చేర్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాట్నం స్థానంలో ‘అశోకచక్రం’ చేర్చారు…అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మనకందించిన మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూనే ఉంది. ఆగస్టు 2న ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుడి సేవలను స్మరించుకుందాం.