వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ఏపీ రాజధానిపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రం సంచలన ప్రకటన చేసింది. ఏపీ రాజధాని అమరావతే అంటూ కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. విజభన చట్టం ప్రకారమే అమరావతి ఏర్పాటైందని స్పష్టం చేసింది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 లతో రాజధాని అమరావతి అని కేంద్రం ముడిపెట్టింది. విభజన చట్టంలోని నిబంధనల ప్రకారమే అమరావతి ఏర్పాటు అయ్యిందని తేల్చిచెప్పింది. దీంతో రాజధానిని ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఏపీకి లేదని కేంద్రం చెప్పకనే చెప్పినట్టైంది.
మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని, జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల కోసం చేసిన చట్టాలతో సంబంధం లేదని స్పష్టం చేసింది. జగన్ మూడు రాజధానుల చట్టాలతో తమకేమీ సంబంధం లేదని కేంద్రం సంకేతం ఇచ్చింది. అమరావతే రాజధాని అని 2015లో నిర్ణయించారని కేంద్రం స్పష్టం చేసింది. ఏపీ రాజధాని అంశంపై బుధవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ మేరకు రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.