పూలింగ్ లేదు..బీలింగ్ లేదు
-వర్ధన్నపేట రింగ్ రోడ్డు కోసం ల్యాండ్ పూలింగ్.. స్పష్టత నిచ్చిన కేసీఆర్
-భట్టుపల్లిలో విజయవంతంగా ప్రజా ఆశీర్వాద సభ
-భారీ సంఖ్యలో పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు
-లక్షకు పైగా మెజార్టీతో అరూరిని గెలిపించుకోవాలని పిలుపు
వరంగల్ టైమ్స్,వరంగల్ జిల్లా: వర్ధన్నపేట రింగ్ రోడ్డు కోసం ల్యాండ్ పూలింగ్ చేస్తారని కొంత మంది దుర్మార్గులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో అరూరి రమేష్ పై గెలిచే దమ్ము లేనోళ్లు ఈ అబద్దపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర సీఎంగా నేను హామీ ఇస్తున్నా అంటూ వర్ధన్నపేట రింగ్ రోడ్డుకు పూలింగ్ బీలింగ్ లేదని కేసీఆర్ ప్రజా దీవెన సభ వేదికగా స్పష్టం చేశారు. శుక్రవారం వర్ధన్నపేట నియోజకవర్గంలోని భట్టుపల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా దీవెన సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. 24 యేళ్ల క్రితం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన రోజు ఎవరికీ కూడా నమ్మకం లేదు. చాలా అవమానాలు, అవహేళన చేశారు. మనతో పొత్తు పెట్టుకుని గెలిచి 14 యేళ్లు ఏడిపించి, యువకుల చావులు చూసి, నేను చావు నోట్లో తలకాయ పెట్టి ఆమరణ దీక్ష చేస్తే , అప్పుడు దిగి వచ్చి రాష్ట్ర ఇచ్చారని కేసీఆర్ గుర్తు చేశారు.
-అందరికీ న్యాయం చేసే దిశగా ముందుకు పోయాం..
సంసారాన్ని చక్కదిద్దుకున్నట్లు ఒక్కో పనిని పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నాం అని కేసీఆర్ తెలిపారు. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాలను కాపాడుకుంటున్నాం. ఏ కులాన్ని, వర్గాన్ని వదిలిపెట్టకుండా, అందరికీ న్యాయం చేసే దిశగా ముందుకు పోయాం. కరెంట్, సాగు, త్రాగు నీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చేసుకున్నాం అని కేసీఆర్ పేర్కొన్నారు.
-రూ.160 కోట్లతో వర్ధన్నపేట అన్ని విధాలా అభివృద్ధి
నేడు కొంత మంది నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు అని కేసీఆర్ ధ్వజమెత్తారు. వాళ్లకు తెలంగాణ మీద అధికారం, పెత్తనం కావాలి. ప్రజల సంక్షేమం, బాధలు పట్టలేదు. 50 యేళ్లు పాలించిన కాంగ్రెస్ హయాంలో కరెంటు, ఎరువుల పరిస్థితి ఎలా ఉండేనో మీకు తెలుసు. అరూరి రమేష్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట అన్ని రంగాల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించింది. ఎస్సారెస్పీ కాలువల్లో చెట్లు మొలిచి ఉండే, అరూరి రమేష్ నాయకత్వంలో ఆ కాలువలన్నింటినీ బాగు చేసుకున్నాం. నీళ్లు తెచ్చుకుని పంటలు పండించుకుంటున్నాం. ఐనవోలు, హసన్ పర్తి మండలాలకు దేవాదుల నుంచి నీళ్లు తెచ్చుకుని పంటలు పండించుకుంటున్నాం. రూ.160 కోట్లతో వర్ధన్నపేట పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు.
-నా కంటే ఎక్కువ మెజార్టీతో అరూరిని గెలిపించుకోండి:కేసీఆర్
గతంలో రెండు సార్లు అధిక మెజార్టీతో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే అరూరి రమేష్ ను ఈ సారి లక్ష కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించుకోవాలని సీఎం కేసీఆర్ వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. అరూరి రమేష్ వర్ధన్నపేట నియోజకవర్గానికి చేసిన అభివృద్ధే తనను మరో సారి అతి భారీ మెజార్టీతో గెలిపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భట్టుపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ప్రజలను చూసి సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదాన్ని స్వీకరించి జూటా మాటలు మాట్లాడే కాంగ్రెస్, బీజేపోళ్లను నమ్మొద్దని హితబోధ చేశారు. పదేండ్లలలో తాము చేసిన అభివృద్ధిని మరిచిపోవద్దని, ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు.