NTR 31 పోస్టర్ రిలీజ్
ఎన్టీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు: ఆర్ ఆర్ ఆర్ స్టార్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న NTR 31 పోస్టర్ రిలీజ్ .. ఏప్రిల్ 2023 నుంచి ప్రారంభం
వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్: RRR అందించిన జోష్ మీదున్నారు ఎన్టీఆర్. KGF చాప్టర్ 2 సక్సెస్ హై మీదున్నారు ప్రశాంత్‌నీల్. వాళ్లిద్దరూ కలిసి వెండితెరమీద ఎన్టీఆర్ 31తో నెవర్ బిఫోర్ ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని, ఈ సినిమా ఫస్ట్ పోస్టర్‌ని రివీల్ చేశారు మేకర్స్.
రక్తంతో తడిసిన మట్టికి మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయే అర్హత ఉంటుంది.
అతని మట్టి… అతని పాలన…
కానీ అతని రక్తం మాత్రం కాదు…
ట్రిపుల్ ఆర్ మీద, కేజీయఫ్ ఫ్రాంఛైజీ మీద అటు సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు, ఇటు విమర్శకులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు అటు ప్రజల మనస్సులను గెలుచుకోవడమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను కూడా కొల్లగొట్టాయి. అంతటి మన్ననలు పొందుతున్న ఇద్దరు వ్యక్తులు కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఎన్టీఆర్ 31 ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అనే ఎదురుచూపులు బలంగా ఉన్నాయి.
ఎన్టీఆర్ మాస్ జనాలు కోరుకునే పర్ఫెక్ట్ హీరో, ప్రశాంత్ నీల్.. మాస్ ఆడియన్స్ కావాలనుకునే పర్ఫెక్ట్ డైరక్టర్. అందుకే వీరిరువురు కలిసి చేసే సినిమా వెండితెర మీద మాస్ సినిమాలకు సరికొత్త నిర్వచనంలా ఉంటుందని, చూడాలని ప్యాన్ ఇండియా రేంజ్‌లో అంచనాలు మొదలయ్యాయి.
NTR 31 గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ”20 ఏళ్ల క్రితం నా మనసులో పడ్డ ఆలోచనకు రూపమే ఈ సినిమా. ఈ సినిమా హద్దులూ, పరిధులూ అప్పుడే మనసులో నిర్ణయించుకున్నాను. ఎన్నాళ్లుగానో నా మనసులో పదిలపరచుకున్న నా డ్రీమ్ ప్రాజెక్ట్ ని, నా డ్రీమ్ హీరోతో చేయడం చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి చేస్తున్న సినిమా ఇది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ 31ని 2023 ఏప్రిల్‌లో సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి అన్ని రకాల సన్నాహాలు జరుగుతున్నాయి.