సినీ, రాజకీయాల్లో మా నాన్న ది చెరగని ముద్ర
వరంగల్ టైమ్స్, తెనాలి : జన్మనిచ్చి అభిమానుల గుండెల్లో స్థానం కల్పించిన తన తండ్రి ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాలకు హాజరుకావడం సంతోషంగా ఉందని ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాలను పురస్కరించుకుని గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అలనాటి నటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, నాగిరెడ్డి కుమారుడు విశ్వనాథరెడ్డికి ‘ఎన్టీఆర్’ పేరిట అవార్డులను బాలకృష్ణ అందజేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. “సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారు. ఆయన ఎవరి రుణం ఉంచుకోలేదు. చెన్నైకి తెలుగు గంగ ద్వారా నీరు అందించారు. కష్టపడి పనిచేశారు కాబట్టే బి.నాగిరెడ్డి, సావిత్రి లను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. వాళ్లు చేసిన సినిమాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. నటన అంటే సావిత్రిలా ఉండాలి, ఆమె నటన అజరామరం. అందుకే ఆమె మహానటిగా అందరి గుండెల్లో నిలిచిపోయారు. ఎన్టీఆర్ అవార్డు అందుకునేందుకు సావిత్రి కుమార్తె చాముండేశ్వరి రావడం ఆనందంగా ఉందన్నారు.
తెనాలి ప్రాంతం ఎందరో ప్రముఖులు, కవులు, కళాకారులకు జన్మనిచ్చిన ప్రాంతమని గుర్తు చేశారు. వారంతా సినిమా రంగంపై చెరగని ముద్ర వేశారు. ఎన్టీఆర్‌తో నటించిన వారంతా చిరస్మరణీయులే. ఇవాళ పాతాళ భైరవి సినిమా విడుదలైన రోజు కావటం మరో విశేషమన్నారు. కమర్షియల్ సినిమాలకు ఎన్టీఆర్ ఆద్యులు. ఆయన నటించిన భక్తిరస సినిమాలు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి, ప్రజల్లో భక్తిభావం పెంపొందించాయి. తన తండ్రి లాగా తాను కూడా కులమతాలకు అతీతమని తెలిపారు. నా అభిమానులంతా నా కుటుంబంలో భాగమే” అని బాలకృష్ణ ఈ సందర్భంగా పేర్కొన్నారు.