గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ బాధ్యతలు
వరంగల్ టైమ్స్, పనాజీ : ప్రమోద్ సావంత్ మరోసారి గోవా సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బీజేపీ శాసనసభాపక్షం సమావేశంలో సీఎల్పీ నేతగా ప్రమోద్ సావంత్ ను ఎన్నుకున్నారు. సావంత్ పేరును విశ్వజిత్ రాణే ప్రతిపాదించగా, మిగతా సభ్యులు అంగీకారం తెలిపారని బీజేపీ కేంద్ర పరిశీలకుడు, కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. అనంతరం సావంత్ మీడియాతో మాట్లాడుతూ మరోసారి సీఎల్పీ నేతగా ఎన్నుకున్నందుకు థాంక్స్ తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 20 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. శాసనసభలో మెజారిటీ కంటే ఒక సీటు తక్కువ రాగా, ఎంజీపికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ప్రభుత్వ ఏర్పాటు విషయమై పలువురు ఎమ్మెల్యే, పార్టీ నేతలు గవర్నర్ ను కలిశారు.