పట్టాలెక్కిన వందేభారత్ ఎక్స్ ప్రెస్  

పట్టాలెక్కిన వందేభారత్ ఎక్స్ ప్రెస్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్ సెమీ హైస్పీడ్ రైలు నేడు పట్టాలెక్కింది. తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైలు ప్రారంభమైంది. సికింద్రాబాద్-విశాఖపట్టణం మధ్య నడిచే ఈ రైలును నేడు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి , రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పాల్గొన్నారు.పట్టాలెక్కిన వందేభారత్ ఎక్స్ ప్రెస్  వందేభారత్ ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ మాట్లాడారు. “తెలుగు ప్రజలకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ పండుగ కానుక అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వందేభారత్ లో తెలుగు ప్రజల మధ్య వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుందని చెప్పారు. ఈ రైలులో ద్వారా రెండు రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణంతో పాటు సమయం సద్వినియోగం అవుతుందని అన్నారు. ప్రజలను ప్రగతిలో భాగస్వామ్యులను చేసే కార్యక్రమం కొనసాగుతోందని, ఇందుకు వందేభారత్ ఒక సాక్ష్యమని తెలిపారు. 8యేళ్ల క్రితం వరకు భారతీయ రైల్వే అంటే నిరాశే కనిపించేవని, అసాధ్యమనుకున్న మార్పులను చేసి చూపించామని ప్రధాని మోడీ వెల్లడించారు”.