ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఎండలు
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గత రెండ్రోజుల నుంచి ఎండ మండిపోతోంది. ఇప్పటికే సూర్యుని వేడితో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలోని కొన్ని చోట్ల నేడు 46 లేదా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలున్నట్లు ఐఎండీ పేర్కొంది. సఫ్ దార్ జంగ్ అబ్జర్వేటరీ వద్ద శుక్రవారం అత్యధికంగా 42.5 డిగ్రీలు నమోదైంది. ఇక నజఫ్ నగర్ లో శుక్రవారం అత్యధికంగా 46.1 డిగ్రీల సెల్సియస్ రికార్డైంది. జఫార్ పూర్, ముంగేశ్ పూర్ లో అత్యధికంగా 45.6 డిగ్రీలు నమోదు అయ్యాయి. ఢిల్లీలోని పీతాంపురలో కూడా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడ 44.7 డిగ్రీలు నమోదైనట్లు తెలుస్తోంది. ఆదివారం కోసం కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వచ్చే వారం మబ్బులు నిండిన ఆకాశం, చిరు జల్లుల వల్ల కొంత ఊరట లభించే అవకాశాలున్నాయి. ఈ యేడాది వేసవిలో ఇది 5వ హీట్ వేవ్. మార్చిలో ఓసారి భారీ ఎండలు కొట్టాయి. ఆ తర్వాత ఏప్రిల్ లో 3 సార్లు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.