వనదేవతలను దర్శించుకున్న సీతక్క,అద్దంకి

వనదేవతలను దర్శించుకున్న సీతక్క,అద్దంకివరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ప్రజలు పట్టం కట్టడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. తాడ్వాయి మండలంలోని మేడారం వనదేవతలను సీతక్కతో పాటు అద్దంకి దయాకర్ దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని సమ్మక్క, సారలమ్మ వనదేవతలను వేడుకున్నట్లు వారు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేడారం మహాజాతరకు జాతీయ హోదా కల్పించే విధంగా చొరవ తీసుకుంటామని పేర్కొన్నారు.

మహాఘట్టం ఇంకొన్న గంటల్లో మొదలు కాబోతున్నప్పటికీ , జాతర పనులు మాత్రం పూర్తి కావట్లేదని సీతక్క మండిపడ్డారు. సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతర పనుల్లో అవకతవకలు జరిగితే ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అనంతరం మేడారం వనదేవతలను దర్శించుకోవడానికి తరలివస్తున్న భక్తులకు సీతక్క, అద్దంకి దయాకర్ స్వాగతం సుస్వాగతం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి రవళి రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్ , ఇతర జిల్లా కాంగ్రెస్ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.