హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ వద్ద శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , మంత్రి సత్యవతి రాథోడ్, కే కేశవరావు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు బుధవారం ఘన నివాళులర్పించారు. అఖండ భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఒకే ఒక్క తెలుగు వాడు, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. తన భూములను పేదలకు పంచి నాడు ఉమ్మడి రాష్ట్రంలో భూ సంస్కరణలకు బీజం వేసిన భూ దాత అని కీర్తించారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి పదవులు చేపట్టి ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని కాపాడారని కొనియాడారు. దేశ రక్షణ కోసం అణు పరీక్షల కార్యక్రమాన్ని మొదలు పెట్టింది పీవీ నరసింహారారే అన్నారు. పీవీ సంస్కరణల స్ఫూర్తి తోనే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక పరిపాలన సంస్కరణలు తెస్తున్నారన్నారు. 2020, జూన్ 28 నుంచి 2021 జూన్ 28 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పీవీ శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తున్నదని తెలిపారు. పీవీకి భారత రత్న ఇవ్వాలని, వారి చిత్ర పటాన్ని పార్లమెంటులో పెట్టాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరినట్లు పేర్కొన్నారు. పీవీ పుట్టిన లక్నేపల్లి, పెరిగిన వoగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారని తెలిపారు. పీవీ ఉమ్మడి వరంగల్ జిల్లా వారు కావడం మన అదృష్టమని మంత్రలు దయాకర్రావు. సత్యవతిరాథోడ్ చెప్పారు. పీవీ జీవితం ప్రతి ఒక్కరికు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.