తెలంగాణ తిరుపతి..కళ్యాణోత్సవంతో కేసీఆర్
వరంగల్ టైమ్స్, నిజామాబాద్ జిల్లా : తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బిర్కూర్ మండలం తిమ్మాపూర్ లో గల శ్రీ వెంకటేశ్వరస్వామి క బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం కేసీఆర్ పర్యటన దిగ్విజయంగా కొనసాగింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం మేరకు ఈ క్షేత్రంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణానికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం దేవాలయ అభివృద్ధికి సంబంధించిన వివరాలతో కూడిన పైలాన్ ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అక్కడ నుంచి నేరుగా దేవాలయంకు చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులను దేవస్థాన పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు స్వామివారికి రెండున్నర కిలోల బంగారు కిరీటాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అందచేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనము ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందించారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలతో సన్మానించారు.వేంకటేశ్వర దేవాలయం తరపున సీఎం కేసీఆర్ కు జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సీఎం మొక్క నాటారు. దైవ దర్శనం అనంతరం అక్కడే కొండ కింద ఏర్పాటు చేసిన కృతజ్ఞత బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. తర్వాత అక్కడే స్పీకర్ ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన ఆతిథ్యాన్ని స్వీకరించారు. స్పీకర్ ఆహ్వానం మేరకు వారి నివాసానికి వెళ్లారు. అక్కడ స్థానిక ప్రజా ప్రతినిధులను ప్రజలను కలిశారు. అనంతరం హైదరాబాద్ కు తిరిగి చేరుకున్నారు.