మేడారం జాతరలో ప్రారంభమైన తొలి ఘట్టం

మేడారం జాతరలో ప్రారంభమైన తొలి ఘట్టంవరంగల్ టైమ్స్, ములుగు జిల్లా: తెలంగాణ కుంభమేళాగా భావించే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రారంభమైంది. మహాజాతరలో మొదటి రోజైన నేడు సమ్మక్క భర్త పగిడిద్దరాజు, కూతురు సారలమ్మ, అల్లుడు గోవిందరాజులు మేడారం గద్దెల వద్దకు చేరుకున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి డోలు వాయిద్యాలు, శివసత్తుల నృత్యాల నడుమ సమ్మక్క భర్త పగిడిద్దరాజును తీసుకుని మంగళవారం రోజు పాదయాత్రగా పెనక వంశానికి చెందిన పూజారులు మేడారానికి బయల్దేరారు. 24 గంటల పాటు పాదయాత్ర సాగిన తర్వాత బుధవారం సాయంత్రం పగిడిద్దరాజు మేడారం చేరుకున్నారు. ఏటూరునాగారం మండలం కన్నాయిగూడెం నుంచి పెనక వంశానికి చెందిన పూజారులు గోవిందరాజులును మేడారం తీసుకొచ్చారు. అలాగే కన్నేపల్లి నుంచి కాక వంశానికి చెందిన పూజారులు సారలమ్మను మేడారం తీసుకొచ్చారు.

మేడారంలోని సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద ఆదివాసీ సంప్రదాయ పద్ధతులను అనుసరిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేడారం గద్దెలపై సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై కొలువుదీర్చారు. దీంతో మేడారం మహాజాతర అట్టహాసంగా ప్రారంభమైంది. మేడారం మహాజాతరలో తొలి ఘట్టం ప్రారంభమవడంతో వనదేవతలను వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. దీంతో మేడారం పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారాన్ని( బెల్లాన్ని) కానుకగా సమర్పిస్తున్నారు. అమ్మవార్లకు బెల్లం, ఒడిబియ్యం, చీరెసారెలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.