రష్యాపై ఒత్తిడి పెంచాలని భారత్ ను కోరిన యూకే

రష్యాపై ఒత్తిడి పెంచాలని భారత్ ను కోరిన యూకే

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : ఉక్రెయిన్ లో దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాపై డిప్లొమాటిక్ ఒత్తిడి పెంచాలని భారత ప్రభుత్వాన్ని యూకే కోరింది. భారత్ తో పాటు చైనా కూడా ఇదే పని చేయాలని సూచించింది. ఈ మేరకు బ్రిటన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డొమినక్ రాబ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ” ఇక్కడ చైనా చేయాల్సిన పని ఉంది. వాళ్లు కూడా ముందుకు రావాలి. ఎంతైనా ఆ దేశం యూఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం. భారత్ కూడా ముందుకొచ్చి దౌత్య సంబంధ ఒత్తిడి పెంచాలి” అని ఆయన అన్నారు. రష్యాపై ఒత్తిడి పెంచాలని భారత్ ను కోరిన యూకేరష్యాతో స్నేహ సంబంధాలు ఉన్న చైనా, భారత్ రెండు దేశాలు కూడా ఉక్రెయిన్ దురాక్రమణపై బహిరంగంగా ఎటువంటి విమర్శలు చేయలేదు. ఈ విషయంలో రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం చేసే సమయంలో కూడా ఈ రెండు దేశాలు ఓటు వేయలేదు. తాజాగా రష్యా దాడిపై స్వతంత్ర కమిటీతో విచారణ జరిపించాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం అభిప్రాయపడింది. దీనిపై జరిగిన ఓటింగ్ లో కూడా చైనా, భారత్ ఓటింగ్ కు దూరంగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ రెండు దేశాలు కూడా రష్యాపై ఒత్తిడి పెంచాలని యూకే ఉపప్రధాని అన్నారు. అలాగే తమ దేశంపై విధించిన ఆంక్షలు యుద్ధం ప్రకటించినట్లేనని అన్న రష్యా వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుబట్టారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆంక్షలు యుద్ధ ప్రకటనలు కాదని తేల్చిచెప్పారు. తాము విధించిన ఆంక్షలు పూర్తిగా చట్టపరమైనవేనని స్పష్టం చేశారు.