ఆ నలుగురు బీఆర్ఎస్ కొంప ముంచేనా ?
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : మహబూబాబాద్ జిల్లాలో కారు ఓవర్ లోడ్ అయ్యిందా ? స్థానిక ఎంపీకి, ఇతర ప్రజాప్రతినిధులకు పడట్లేదా ? ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు సొంత పార్టీ నేతలే చెక్ పెట్టాలనుకుంటున్నారా ? రెడ్యా నాయక్ కు జిల్లా మంత్రికి గ్యాప్ ఉందా ? నేతల మధ్య సిగ పట్లు తారాస్థాయికి చేరాయా ? అసలు ఈ ఓవర్ లోడింగ్ బీఆర్ఎస్ కొంప ముంచే ప్రమాదముందా ? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది !!
*ఓటు బ్యాంక్ ఉండగానే సరిపోతుందా..
మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు గట్టి ఓటు బ్యాంకు ఉంది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. కానీ అదే సమయంలో జిల్లాకు చెందిన గట్టి లీడర్లంతా దాదాపుగా గులాబీ పార్టీలోనే ఉన్నారు. వేర్వేరు పార్టీలకు చెందిన వారైనప్పటికీ అందరూ గులాబీగూటికి చేరారు. దీంతో పైకి బీఆర్ఎస్ బలంగా కనిపిస్తోంది కానీ గులాబీ నేతల మధ్య మాత్రం ఢీ అంటే ఢీ అనే వాతావరణమే కనిపిస్తోంది.
* వారిద్దరికి అందుకే పడటం లేదా !
మొదటగా మహబూబాబాద్ ఎంపీ సీటు విషయానికొస్తే ఇక్కడి నుంచి మాలోత్ కవిత లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో ఆమెకు పొసగడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో కవిత ఎంపీగా కంటే, మహబూబాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంపైనే ఆసక్తిగా ఉన్నారని టాక్. అందుకే కవిత ఎక్కడ తన సీటుకు ఎసరు పెడతారోనన్న అనుమానంతోనే శంకర్ నాయక్ వేగంగా పావులు కదుపుతున్నారన్న వాదన వినిపిస్తోంది. అప్పుడప్పుడు ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలిసి ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే, చిన్న డిస్ట్రబెన్స్ అయినా జరిగేది అందుకేనన్న అనుమానాలున్నాయి. అదే సమయంలో ఎమ్మెల్యే సీటు కోసం కవిత ఎంపీగా పోటీకి నిరాకరిస్తే, ఆ ఎంపీ సీటు కోసం మాజీ ఎంపీ సీతారాం నాయక్ సిద్ధంగా ఉన్నారు. దీంతో ఎంపీ సీటును వదులుకోలేక, ఎమ్మెల్యే సీటు కోసం గట్టిగా అడగలేక మాలోత్ కవిత డిఫెన్స్ లో పడ్డారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.*వారి మధ్య అంతర్గత వార్ ఇంకా కొనసాగుతుందా!
ఇక జిల్లా నుంచి మంత్రిగా వ్యవహరిస్తున్న సత్యవతి రాథోడ్ కు సీనియర్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కు గ్యాప్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే గతంలో సత్యవతి రాథోడ్ పైనే రెడ్యా నాయక్ గెలిచారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులతో రెడ్యా నాయక్ కూడా గులాబీకండువా వేసుకున్నారు. దీంతో సత్యవతి రాథోడ్ కు ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రిని చేశారు సీఎం కేసీఆర్. కానీ గతంలో ప్రత్యర్థులుగా ఉన్న ఈ ఇద్దరు లీడర్ల మధ్య గ్యాప్ అలాగే ఉందని టాక్ వినిపిస్తోంది.
* సీనియర్లంతా ఒకే గూటిలో ఉండటమే..
మహబూబాబాద్ జిల్లాలో మిగతా నియోజకవర్గాలున్నప్పటికీ ఆ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు అంత తలనొప్పులు వచ్చే పరిస్థితుల్లేవు. కానీ జిల్లా నుంచి గట్టి లీడర్లుగా ఉన్న రెడ్యా నాయక్, సత్యవతి రాథోడ్, శంకర్ నాయక్, మాలోత్ కవిత లాంటి వారి మధ్య గ్యాప్ కనిపిస్తోందన్న వాదన ఉంది. అంతేకాదు బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న ఈ నలుగురు ఒకే పార్టీలో ఉండటమే పెద్ద మైనస్ గా మారిందన్న వాదన వినిపిస్తోంది. ఒకరిపై ఒకరు డైరెక్ట్ గా విమర్శలు చేసుకోరు కానీ అంతర్గత రాజకీయాలు చేస్తుంటారన్న విమర్శలు గులాబీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నారు. వీరంతా కారెక్కడం వల్లే ఈ సమస్య తలెత్తిందన్న గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఈ కారు ఓవర్ లోడింగ్ ఎక్కడ బీఆర్ఎస్ కొంప ముంచుతుందోనన్న ఆందోళన బీఆర్ఎస్ శ్రేణులను వెంటాడుతోంది. మరి ఎన్నికల నాటికి ఈ పరిస్థితిలో మార్పు వస్తుందా ? ఈ నాయకులు కలిసి ముందుకు సాగుతారా ? ఇంటర్నల్ వార్ తో కూర్చున్న కొమ్మనే నరుక్కుంటారా? అన్నది చూడాలి.