దిక్కులు పిక్కటిల్లేలా రైతు సంఘర్షణ సభ : రేవంత్
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన గడ్డ వరంగల్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే హనుమకొండ నడిబొడ్డున సభ పెట్టాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సూచించారని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితోనే వరంగల్ లో సభ నిర్వహిస్తున్నామన్నారు. హనుమకొండలో మే 6న జరుగనున్న రైతు సంఘర్షన సభ సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు.అనంతరం హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇది ఎన్నికల కోసం పెడుతున్న సభ కాదని, అన్నదాతలు, ఉద్యమ అమరవీరుల కోసం ఏర్పాటు చేస్తున్న సభ అని రాహుల్ గాంధీ తెలిపినట్లు రేవంత్ తెలిపారు. వరంగల్ గడ్డ స్ఫూర్తినిస్తుందని రాహుల్ గాంధీ సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పరిస్థితులపై రాహుల్ కు అపారమైన అవగాహన ఉందన్నారు.
ఇక తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనా తీరుపై రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉద్యమ అమరవీరులను రాష్ట్ర ప్రభుత్వం అనాథలను చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోలేదని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి యేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు రుణమాఫీ పూర్తి చేయలేదు, తద్వారా బ్యాంకులకు వెళ్లి మళ్లీ అప్పు తెచ్చుకోలేని పరిస్థితుల్లో రైతులున్నారని తెలిపారు. అధిక వడ్డీలకు డబ్బు తీసుకొచ్చి తిరిగి కట్టలేని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక కమీషన్ల కోసం నకిలీ విత్తనాల కంపెనీలపై చర్యలు తీసుకోకుండా లక్షల కోట్లు సంపాదన కక్కుర్తి పడి రైతుల ఆత్మహత్యలకు కారణమైంది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీలు వేసిన నీచమైన చరిత్ర కేసీఆర్ దని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. వరి కాదు, వేరే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సీఎం రైతులకు సూచించారు.
ఈ జిల్లాలో మిర్చి పంటకు తెగులు సోకి పంట నాశనం కావడంతో ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే 22 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోలేదని విమర్శించారు. ఇప్పటి వరకు బాధిత రైతు కుటుంబాలను గానీ, తెగులు సోకిన పంటలను గానీ పరిశీలించిన వ్యవశాఖ అధికారులు కానీ ఇప్పటివరకు అటు వైపు తొంగిచూసిన దాఖలాలు లేవు, ప్రభుత్వానికి బాధ్యత లేదని ఎద్దేవా చేశారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూసి వేయడం వల్లనే 10 లక్షల ఎకరాల్లో చెరుకు పండించే రైతులు ప్రత్యామ్నాయంగా వరి పంట సాగు వైపు మళ్లారు, లక్షల ఎకరాల్లో పసుపు పండించే రైతులు గిట్టు బాటు ధర రాక , వరి సాగు వైపు మళ్లారు. అధికార ప్రభుత్వం వ్యవహార శైలిని ఎండగట్టేందుకే ఈ రైతు సంఘర్షణ సభ అని తెలిపారు. మే 6న నిర్వహించబోయే రైతు సంఘర్షణ సభను దిక్కులు పిక్కటిల్లేలా విజయవంతం చేయాలని కోరారు. రాహుల్ సభకు అన్ని దారులు ఓరుగల్లు వైపే అన్నట్లుగా కదలాలి అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.