స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయంహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని 5 ఉమ్మడి జిల్లాల్లో 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అన్నింటా భారీ మెజారిటీతో గెలిచింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి భానుప్రసాద్ రావు, ఎల్. రమణ, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వంటేరి యాదవరెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తాతా మధుసూదన్ రావు, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎంసీ కోటిరెడ్డి గెలుపొందారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి దండె విఠల్ విజయం సాధించారు. ఖమ్మం, మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్, కరీంనగర్ లో స్వతంత్ర అభ్యర్థిగా టీఆర్ఎస్ మాజీ మేయర్ పోటీ చేసినప్పటికీ టీఆర్ఎస్ మెజార్టీకి దరిదాపుల్లోకి రాలేదు.

ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ లు సంతోషం వ్యక్తం చేశారుు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో భారీ ఎత్తున సంబురాలు నిర్వహించారు. స్థానిక సంస్థల కోటాలో ఇప్పటికే 4 ఉమ్మడి జిల్లాల్లో 6 స్థానాలు, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో రెండేసి, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇక టీఆర్ఎస్ తాజా విజయంతో 9 ఉమ్మడి జిల్లాల్లోని 12 స్థానాలను కైవసం చేసుకుంది.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ఘనవిజయం సాధించడం టీఆర్ఎస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థుల విజయంపై తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శ్రేణులు బాణసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన మధుసూదనాచారి తెలంగాణభవన్ కు వచ్చి ఆచార్య జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలదండ వేశారు.

ఎమ్మెల్యే కోటాలో 6 స్థానాలతో పాటు స్థానిక సంస్థల కోటాలో 12 స్థానాలను పార్టీ నిలబెట్టుకుంది. దీంతో శాసనమండలిలో తన ఆధిక్యాన్ని చాటుకుంది. ఇక బండా ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంతో పాటు 2022 జూన్ లో ఖాళీ కానున్న డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు రాజ్యసభ స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరిగే వీలుంది. శాసనసభలో బలం దృష్ట్యా 3 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

టీఆర్ఎస్ కి మరింత బలం పెరిగింది..
40 స్థానాలున్న తెలంగాణ శాసనమండలిలో 2 నెలల వ్యవధిలో టీఆర్ఎస్ కు 19 మంది కొత్త ఎమ్మెల్సీలు వచ్చారు. దీంతో శాసనమండలిలో మొత్తం స్థానాలు భర్తీ అయ్యాయి. ఇందులో టీఆర్ఎస్, దాని మద్దతుదారులైన ఇద్దరు పీఆర్టీయూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో మొత్తం సంఖ్య 36కి చేరుకుంది. మండలిలో టీఆర్ఎస్ మిత్రపక్షమైన మజ్లిస్ కు 2 స్థానాలు ఉండగా, కాంగ్రెస్, యూటీఎఫ్ సభ్యులు ఒక్కొక్కరు ఉన్నారు.

సీఎం కేసీఆర్ అభినందనలు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థులకు, వారి విజయానికి కృషిచేసిన పార్టీ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. చెన్నైలో ఉన్న కేసీఆర్ ఆరుగురు కొత్త ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు. 5 జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ శ్రేణులను అభినందించారు.