హైకోర్టు డివిజన్ బెంచ్ లో టీఎస్పీఎస్సీ వాదనలు

హైకోర్టు డివిజన్ బెంచ్ లో టీఎస్పీఎస్సీ వాదనలు

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేస్తున్నామని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం విద్యార్థి 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు వరుసగా ఎక్కడ చదివితే ఆ రాష్ట్రంలోనే స్థానికత వర్తిస్తుందని కమిషన్ తరపున ప్రత్యేక న్యాయవాది సంజయ్ కుమార్ డివిజన్ బెంచ్ కు నివేదించారు. ఇందులో ఏ ఒక్క తరగతి బయట చదివినా నాన్ లోకల్ కింద పరిగణిస్తామని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ లో రాష్ట్రపతి ఉత్తర్వులు, 95 శాతం స్థానికత కోటా వర్తింపునకు సంబంధించి పూర్తి సమాచారం ఉందన్నారు. తెలంగాణలో 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి గత యేడాది ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.

దీనిపై ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణంలో 6వ తరగతి చదివిన ఓ అభ్యర్థి తెలంగాణలో తనను లోకల్ గా పరిగణించాలని రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సింగిల్ జడ్జి సానుకూలంగా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ పుల్లా కార్తీక్ తో కూడిన డివిజన్ బెంచ్ ను సంజయ్ కుమార్ కోరారు.

గ్రూప్-1 ఉద్యోగానికి డిగ్రీ విద్యార్హత కాబట్టి చివరి నాలుగేండ్లు తెలంగాణలో చదివితే స్థానికత వర్తిస్తుందని ఆ అభ్యర్థి చేసిన అభ్యర్థన సరైంది కాదని వాదించారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారని అన్నారు. ఈ ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని కోరారు. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ ద్విసభ్య ధర్మాసనం ఎదుట టీఎస్పీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ ను ఆమోదించాలని వేడుకున్నారు. కాగా, తదుపరి వాదనలు బుధవారం కొనసాగనున్నాయి.

కోర్టు కేసు వల్లనే గ్రూప్-1 ఫలితాలు ఆలస్యం..
ప్రభుత్వ కొలువుల భర్తీలో రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేస్తున్నామని టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్ధన్ రెడ్డి అన్నారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఇక్కడ చదివిన వారినే లోకల్ గా పరిగణిస్తామన్నారు. రాస్ట్రపతి ఉత్తర్వులను నోటిఫికేషన్ లో పొందిపరిచామని తెలిపారు. అక్టోబర్ లోనే గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఫలితాలు ఇవ్వాలని అనుకున్నప్పటికీ కోర్టు కేసు వల్ల జాప్యం జరుగుతుందన్నారు. ఈ కేసు రెండు, మూడు రోజుల్లో కొలిక్కే వచ్చే అవకాశం ఉందన్నారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. మెయిన్స్ పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు 3 నెలల సమయమిస్తామని ఆయన తెలిపారు.