ఫోన్ మైకంలో మరో వ్యక్తి బైక్ ఎక్కిన భార్య 

ఫోన్ మైకంలో మరో వ్యక్తి బైక్ ఎక్కిన భార్య 

వరంగల్ టైమ్స్, హావేరి జిల్లా : కర్నాటక రాష్ట్రంలోని హావేరి జిల్లా రాణేబెన్నూరులో బుధవారం వింతైన సంఘటన చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం దాదాపు ఒకే రకమైన రంగులో ఉన్న రెండు హోండా బైక్‌లు ఒకే సమయంలో పెట్రోల్ బంక్‌కు వచ్చాయి. రెండు మోటారు బైక్‌లపై ఇద్దరు వ్యక్తులు, వారి వెనుక భార్యలు ఉన్నారు. ఐతే నలుగురూ హెల్మెట్ ధరించి ఉన్నారు. ఇద్దరు మహిళలు ఒకే రకమైన దుస్తులు ధరించి ఉన్నారు. ఇద్దరు మహిళల్లో ఫోన్‌ మాట్లాడుతూ ఉన్న మహిళ పెట్రోలు కొట్టించిన బైక్‌ స్టార్ట్‌ చెయ్యగానే ఎక్కి కూర్చుంది.

కొంతదూరం వెళ్లాక తమ ఇంటికి వెళ్లే మార్గంలో కాకుండా వేరే మార్గంలో బైక్‌ వెళ్లడాన్ని గమనించి ‘ఏమండీ మన ఇళ్లు ఇటు కాదు కదా! ఇటెందుకు వెళ్తున్నారని’భర్తను ప్రశ్నించింది.దీంతో బైక్‌ రైడ్ చేస్తున్న భర్త తన భార్య స్వరం వింతగా ఉండటంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. అంతే బైక్‌ ఆపుచేసి చూస్తే ఆమె తన భార్య కాదని గ్రహించాడు. వెంటనే పెట్రోల్‌ బంక్‌కు తిరిగిరాగా జరిగిన తప్పిదం గ్రహించి నాలుక కరచుకున్నారు. అంతే నలుగురూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వులేనవ్వులు. సాధారణంగా పురుషులందరూ ఒకే రకమైన హెల్మెట్లు ధరించడం షరా మామూలే. హెల్మెట్‌ ధరించడం వల్ల ఎవరి బైక్‌ ఎవరెక్కారో తెలియక తికమక పడ్డారు.