మనం పెట్రోల్, డీజిల్ ధర పెంచలే..కానీ
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ ఒక్కరోజు కూడా మనం డీజిల్, పెట్రోల్ ధరలు పెంచలేదని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ కేంద్రం ఆకాశమెత్తు పెంచిన డీజిల్ ధరలతో ఆర్టీసీ మీద నేరుగా భారం పడుతోందని తెలిపారు. దాదాపు 2 నుంచి 3వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఆ సంస్థను మనం బతికిస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ ప్లీనరీ వేదికపై కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీ పాలనా తీరుపై మండిపడ్డారు. ప్రధాని ఆర్టీసీని అమ్మినోళ్లకు 1000 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ పెట్టిన ఘనుడు అని ఎద్దేవా చేశారు. ఆయన అమ్మేది చాలక, మనం కూడా అమ్ముకోవాలంట అని కేసీఆర్ మండిపడ్డారు. ఉన్న సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేయండి. ఏ రాష్ట్రమైతే అమ్ముతదో వారికి వెయ్యి కోట్ల ప్రైజ్ మనీ పెట్టిన ఘనుడు మన ప్రధాన మంత్రి మోడీ అని ఇది దేశంలో జరుగుతున్న వాస్తవాలని సీఎం కేసీఆర్ విమర్శించారు.
ఏదైనా విధ్వంసం చేయాలని చాలా సులభం. కానీ ఏదైనా నిర్మాణం చేయాలంటే మాత్రం చాలా సమయం పడుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. అనేక వేలవేల సంవత్సరాల సంస్కృతి, సంప్రదాయం, సహన శీలత, ఓర్పు ఉన్నట్టుంటి వైవిధ్యమైన దేశం మన భారత దేశం. 500 సంస్థానాలను విలీనం చేసుకుని ఒక ఫెడరల్ శక్తిగా ఏర్పడ్డ దేశం భారతదేశం. అలాంటి దేశంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో నడుస్తున్న తరుణంలో భయంకరమైన విషాన్ని ఈ దేశంలో జొప్పిస్తున్నారని కేంద్రంపై తీవ్రంగా ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్.
టీఆర్ఎస్ శిక్షణా శిబిరాల్లో కేంద్రం కూటనీతి, దేశం ప్రత్యామ్నాయం ఎజెండా, దేశం ముందుకు పోవాల్సిన విధానాలు, స్పష్టమైన సిలబస్ రూపకల్పన చేసి, అన్ని విషయాలు తేటతెల్లంగా తెలియచేయడం జరుగుతుంది. దాన్ని మళ్లీ ప్రజాక్షేత్రంలో పెట్టి ఈ దుర్మార్గుల నీతిని ఎండగట్టాలని మనవి చేస్తున్నానని పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.