జనగామలో అధికారపార్టీకి ముచ్చెమటలు ! 

జనగామలో అధికారపార్టీకి ముచ్చెమటలు !

జనగామలో అధికారపార్టీకి ముచ్చెమటలు ! వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : జనగామ నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేక నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి పొన్నాల పేరు తెరపైకి వస్తోంది. దీంతో ఇద్దరు నేతల మధ్య టఫ్ ఫైట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జనగామ నుంచి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా రెండు సార్లు గెలిచిన చరిత్ర ముత్తిరెడ్డిది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో ప్రత్యేక చొరవ చూపుతూ ఆయన మంచిపేరు తెచ్చుకున్నారు. ముత్తిరెడ్డి చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ రోజూ నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ప్రజల్లోనే ఉంటారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ పాలనలో చేపట్టిన ప్రతీ సంక్షేమ పథకం ప్రతీ ఇంటికీ చేరాలన్నదే ముత్తిరెడ్డి ఆలోచన.జనగామలో అధికారపార్టీకి ముచ్చెమటలు ! అభివ్రుద్ధి విషయంలో ముత్తిరెడ్డి పాస్ మార్కులు సాధించినప్పటికీ భూకబ్జాల ఆరోపణలు మాత్రం ఆయనను ఇరకాటంలో పెడుతున్నాయి. దందాలు, అవినీతి కార్యకలాపాల్లో ముత్తిరెడ్డి చిక్కుకుపోయారన్న విమర్శలు ఎక్కువగానే ఉన్నాయి. వరుసగా రెండుసార్లు ఇక్కడ్నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో వ్యతిరేకత కూడా ఎక్కువగా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముత్తిరెడ్డికి మరోసారి బీఆర్ఎస్ బీఫాం వస్తుందా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఆయనకే టికెట్ వస్తుందని గులాబీ శ్రేణులు అంచనా వేస్తున్నప్పటికీ ఏదైనా జరగవచ్చన్న అభిప్రాయం ఉంది. ఒకవేళ ముత్తిరెడ్డికి అవకాశం లేకపోతే వేరే పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడిని బీఆర్ఎస్ లోకి తీసుకుని, టికెట్ ఇవ్వొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది.జనగామలో అధికారపార్టీకి ముచ్చెమటలు ! కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పోటీ చేయవచ్చని తెలుస్తోంది. గతంలో ఆయన ఇక్కడ్నుంచే ప్రాతినిధ్యం వహించారు. దీంతో ఆయనకు ఇక్కడ మంచి ఫాలోయింగే ఉంది. కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకు ఉంది. దీనికి తోడు పొన్నాల బీసీ కావడం ఆయనకు కలిసి వచ్చే అంశం. గతంతో పోల్చుకుంటే ఈసారి కాంగ్రెస్ ఇక్కడ బలీయమైన శక్తిగా మారింది. దీంతో ముత్తిరెడ్డికి పొన్నాల గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో లాగా జనగామలో వార్ వన్ సైడ్ కాకపోవచ్చని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు పొన్నాలకు ఇబ్బందిగా మారే ప్రమాదముంది.

జనగామలో బీజేపీ కూడా ఢీ అంటే ఢీ అంటోంది. ఈసారి బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తామని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు. బీజేపీ నుంచి ఒకటి రెండు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇక్కడ గట్టి నేత బరిలో ఉంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ కు గట్టి పోటీనివ్వడం మాత్రం ఖాయం.

మొత్తానికి జనగామలో ఈసారి పోటీ నువ్వా నేనా అనేలా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీని తట్టుకుని మరోసారి ఎమ్మెల్యే కావడం ముత్తిరెడ్డి అంత ఈజీ కాకపోవచ్చు. అలాగని పొన్నాలకు అంతా ఓకే అని చెప్పలేం. ఇక బీజేపీని కూడా తక్కువగా అంచనా వేయలేం. కాబట్టి ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గంలో ఏమైనా జరగొచ్చు. ప్రతి పార్టీకి ఇక్కడ ఓటు బ్యాంకు ఉండడంతో ఈసారి ట్రయాంగిల్ ఫైట్ ఢీ అంటే ఢీ అన్నట్లుగా జరగడం ఖాయం.!