నర్సంపేటలో నాలుగు స్తంభాలాట ! 

నర్సంపేటలో నాలుగు స్తంభాలాట !

నర్సంపేటలో నాలుగు స్తంభాలాట ! వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. 1999 నుంచి ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా ఇక్కడ రెండోసారి గెలవలేదు. నియోజకవర్గ ఓటర్లు ప్రతీసారి మార్పును కోరుకుంటున్నారు. ఎవరినీ రెండోసారి గెలిపించడానికి ఇష్టపడడం లేదు. ప్రస్తుతం ఇక్కడి నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఈసారి సెంటిమెంటు కొనసాగుతుందా? లేక ఎమ్మెల్యే పెద్ది రెండోసారి విజయకేతనం ఎగరవేస్తారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

*ఆమె పాదయాత్రతో పెద్దికి మరింత పెరిగిన ఇమేజ్..
నర్సంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి యాక్టివ్ గానే ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు చేరవేయడంలో తనదైన పాత్రను పోషిస్తున్నారు. కేసీఆర్ పాలనలో రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు, దళితబంధు లాంటి పథకాలు పెద్దికి అనుకూలంగా ఉన్నాయి. 2018లో కేసీఆర్ ఫోటోతోనే సుదర్శన్ రెడ్డి గట్టెక్కారు. ఈసారి కూడా అదే కలిసి వస్తుందన్న భావనలో ఆయన ఉన్నారట. ముఖ్యంగా షర్మిల పాదయాత్ర తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి రేంజ్ పెరిగింది. ఆమె వ్యక్తిగత విమర్శలు చేసినప్పటికీ పెద్ది హుందాగా స్పందించి, నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకున్నారు. షర్మిల పదేపదే విమర్శలు చేయడంతో అది పెద్దికే ప్లస్ అయ్యిందన్న ప్రచారం జరుగుతోంది.

నర్సంపేటలో నాలుగు స్తంభాలాట ! 

*అప్పట్లో గెలిచి ఉంటే మినిస్టర్ చాన్స్ ఉండే..
నిజానికి 2014లోనే నర్సంపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పెద్ది సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. అప్పట్లో టీఆర్ఎస్ కు అనుకూల పవనాలున్నాయి. అయినప్పటికీ అతి విశ్వాసం పెద్ది కొంపముంచింది. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన దొంతి మాధవరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ గెలిచి ఉంటే, ఆయన రాజకీయ జీవితమే వేరుగా ఉండేదంటారు ఆయన సన్నిహితులు. కేసీఆర్ తొలి కేబినెట్ లో మినిస్టర్ కూడా అయ్యేవారని చెప్పుకుంటారు.

*ఆ ఒక్క ఓటమితో అంతా తలకిందులు..
కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. 2014లో ఒక్క ఓటమితో అంతా తలకిందులైంది. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి, అందరికంటే సీనియర్ గా ఉన్న పెద్ది రేసులో లేకుండా పోయారు. 2018లో గెలిచినప్పటికీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. మినిస్టర్ క్యాండిడేట్ కాస్తా ఎమ్మెల్యేగానే ఉండిపోవాల్సి వచ్చింది. అందుకే పెద్ది సన్నిహితులు, గులాబీ శ్రేణులు ఆయనకు అన్యాయం జరిగిందన్న మాట చెబుతుంటారు.

*మళ్లీ పెద్దిదే గెలుపు !
ప్రస్తుతం నర్సంపేటలో బలాబలాల విషయానికొస్తే పెద్ది సుదర్శన్ రెడ్డికి పోరు అంత ఈజీగా ఉండకపోవచ్చు. ఫైట్ టఫ్ గా ఉన్నప్పటికీ పెద్ది గట్టెక్కే అవకాశాలున్నాయి. అలా అని కాంగ్రెస్, బీజేపీలను ఇక్కడ తక్కువ అంచనా వేయడానికి లేదు. కాంగ్రెస్ నుంచి దొంతి మాధవరెడ్డి పోటీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యతిరేకవర్గానికి చెందిన నాయకుడు కావడంతో అదే ఆయనకు మైనస్ అయ్యే అవకాశముంది. కాకపోతే గత ఎన్నికల్లో ఓడిపోవడంతో కొంచెం సానుభూతి ఉంది. గతంలోనూ అంటే 2014లో ఆయన పీసీసీ చీఫ్ వ్యతిరేకిగా ఉండడంతో అప్పుడు కూడా కాంగ్రెస్ టికెట్ రాలేదు. చివరకు దొంతి ఇండిపెండెంట్ గా బరిలో నిలిచి సత్తా చాటారు.నర్సంపేటలో నాలుగు స్తంభాలాట ! *ఎవరినీ అంచనా వేసేలా లేదు !
ఆయనకు ఇక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉండడంతో ఆయనను తక్కువగా అంచనా వేయలేం. ఇక బీజేపీ నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి, గోగుల రాణాప్రతాప్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి నాడెం శాంతి కుమార్ పేరు ప్రముఖంగా ప్రచారంలో ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి నిలిచే నేతలంతా రెడ్లే అయినప్పటికీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి బరిలో నిలవబోతున్న శాంతి కుమార్ ది బీసీ సామాజికవర్గం. దీంతో బీసీ కోటాలో ఆయన గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయని టాక్. సామాజికవర్గ సమీకరణాల్లో శాంతి కుమార్ హిట్ కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు.

మొత్తానికి నర్సంపేటలో చతుర్ముఖ పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పోటీలో పెద్ది సుదర్శన్ రెడ్డికే కొంచెం ఎడ్జ్ ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ ఎన్నికలు వచ్చే నాటికి పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడే అయితే ఊహించలేం. ఎన్నికలకు ఇంకొంచెం టైమ్ ఉంది కాబట్టి నర్సంపేటలో ఏమైనా జరగొచ్చు.!