15 రోజుల్లోగా 100శాతం గొర్రెల పంపిణీ

15 రోజుల్లోగా 100శాతం గొర్రెల పంపిణీ

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : గొర్రెల పంపిణీ కార్యక్రమంలో పైలట్ ప్రాజెక్ట్ క్రింద చేపట్టిన నగదు బదిలీ పథకంలో లబ్దిదారులకు 15 రోజుల్లోగా గొర్రెలను కొనుగోలు చేసి ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.15 రోజుల్లోగా 100శాతం గొర్రెల పంపిణీమంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో గొర్రెల పంపిణీ కార్యక్రమంపై సమీక్షించారు. 15 రోజుల్లోగా 100శాతం గొర్రెల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. పైలట్ ప్రాజెక్ట్ క్రింద ప్రభుత్వం నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలలో లబ్దిదారులకు ఒకొక్కరికి ప్రభుత్వ వాటాధనం 1.58 లక్షల రూపాయలు చొప్పున వారి ఖాతాలకు నగదును బదిలీ చేసిందని వివరించారు.

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలో 4699 మంది లబ్దిదారుల ఖాతాలలో ప్రభుత్వ వాటాధనం జమ చేయడం జరిగిందని తెలిపారు. ఉప ఎన్నికల కోడ్ అమలులోకి రావడం వలన గొర్రెల యూనిట్ల పంపిణీలో జాప్యం జరిగిందని మంత్రి వివరించారు. 15 రోజులలోగా వారందరికీ గొర్రెల యూనిట్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్, జిల్లా పశువైద్యాదికారులను మంత్రి ఫోన్ లో ఆదేశించారు.

గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించడం పట్ల నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన లబ్దిదారులు మంత్రిని కలిసి కృతఙ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో మునుగోడ్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన అయిలయ్య యాదవ్, సత్తయ్య యాదవ్, పుట్ల నర్సింహ తదితరులు ఉన్నారు.