ఆర్ అండ్ బీ శాఖలో కొత్తగా 472 పోస్టులు
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : ఆర్ అండ్ బీ శాఖలో కొత్తగా 472 పోస్టులను సృష్టిస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 132 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ ( సివిల్ ) పోస్టులు, 90 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ( సివిల్ ) పోస్టులు, 61 జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటు మరి కొన్ని పోస్టులను కొత్తగా సృష్టించారు. అయితే గతంలో మంజూరు చేసిన 62 ఉద్యోగాలను రద్దు చేశారు.
గతంలోని సీనియర్ స్టెనో ( లోకల్ కేడర్ ), టైపిస్ట్ ( హెచ్ఓ), టైపిస్ట్ ( లోకల్ కేడర్ ), టెక్నీషియన్ ( హెచ్ఓ), ప్రింటింగ్ టెక్నీషియన్ ( లోకల్ కేడర్), వాచ్ మన్ ( లోకల్ కేడర్), స్వీపర్ ( లోకల్ కేడర్ ) పోస్టులను రద్దు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
గత సంవత్సరం డిసెంబర్ 10న సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రోడ్లు భవనాల శాఖలో పెరిగిన పనికి అనుగుణంగా శాఖను పునర్ వ్యవస్థీకరించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బీ శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది.