టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనం

టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనంవరంగల్ టైమ్స్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. 1200 మంది అమరులను హేళన చేసేలా ప్రధాని మోడీ మాట్లాడాడంటూ బషీర్భాగ్ చౌరస్తాలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. మోడీ వైఖరిని నిరసిస్తూ మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. విభజన హామీలు చేతకాని మోడీకి తెలంగాణ రాష్ట్రంపై మాట్లాడే హక్కుల లేదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మోడీ వైఖరిని దుయ్యబట్టారు.

విభజన హామీలైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎక్కడ మిస్టర్ మోడీ అంటూ నిరసన గళం విప్పి, ప్రధానిని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన బీజేపీ నేడు అవహేళన చేస్తూ మాట్లాడటం సిగ్గుచేటని టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు ధ్వజమెత్తారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు సోయి ఉంటే తెలంగాణపై విషయం చిమ్మిన ప్రధాని మోడీని నిలదీయాలని టీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు అవినాష్, నవీన్, తరుణ్, లక్ష్మణ్, శోభన్, చందు, గౌతమ్, సంతోష్, సాయి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.