అధికారుల పని తీరుపై మండిపడ్డ ప్రభుత్వ చీఫ్ విప్

అధికారుల పని తీరుపై మండిపడ్డ ప్రభుత్వ చీఫ్ విప్హనుమకొండ జిల్లా : అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి నగరాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. పనులలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన అధికారులపై ఫైర్ అయ్యారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి వరంగల్ పశ్చిమ నియెజకవర్గం అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.

నగరంలోని జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో హనుమకొండ నగరాభివృద్ధిపై నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. హనుమకొండ నగరాభివృద్ధిలో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధి పనులకై ఇప్పటి వరకు విడుదలైన నిధులతో సంవత్సరంలోపు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలని చీఫ్ విప్ అధికారులకు సూచించారు.

నిధులను సద్వినియోగం చేసుకుని నగర సుందరీకరణలో భాగస్వాములు కావాలని దాస్యం వినయ్ భాస్కర్ కోరారు. ఇక గతంలో సమీక్షా సమావేశాలు నిర్వహించినా అధికారుల్లో స్పందన కనిపించలేదని ఆయన మండిపడ్డారు. ప్రతీ వార్డులో పర్యటించి అధికారులు సమస్యలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు కొంత సమర్థవంతంగా పనిచేస్తున్నారని, మిగతా శాఖల అధికారులు కూడా ఆ దిశగా పనిచేయాలని దాస్యం పిలుపునిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో నగర మేయర్ గుండు సుధారాణి, కమీషనర్ ప్రావీణ్య, వరంగల్ పశ్చిమ నియెజకవర్గ అధికారులు పాల్గొన్నారు.