కె.విశ్వనాథ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం 

కె.విశ్వనాథ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కె.విశ్వనాథ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం 

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు కళా తపస్వి, పద్మశ్రీ కే.విశ్వనాథ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో వెండి తెర దృశ్య కావ్యముగా మలిచిన అరుదైన దర్శకుడు కె.విశ్వనాథ్ అని సీఎం అన్నారు. గతంలో కె.విశ్వనాథ్ గారి ఆరోగ్యం బాగాలేనప్పుడు వారి ఇంటికి వెళ్ళి పరామర్శించిన సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం గుర్తు చేసుకున్నారు.

భారతీయ సామాజిక సంస్కృతీ సంప్రదాయ విలువలకు తన సినిమాలో పెద్ద పీట వేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. సంగీత సాహిత్యాన్ని ప్రధాన ఇతివృత్తంగా, మానవ సంబంధాల నడుమ నిత్యం తలెత్తే వైరుధ్యాలను అత్యంత సృజనాత్మక గా సున్నితంగా దృశ్యమానం చేసిన గొప్ప భారతీయ దర్శకుడు కె విశ్వనాథ్ అని సీఎం అన్నారు. దాదా సాహెబ్ ఫాల్కే , రఘుపతి వెంకయ్య వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులు ఆయన దర్శక ప్రతిభకు కలికి తురాయిగా నిలిచాయని సిఎం అన్నారు.

తెలుగు సినిమా వున్నన్ని రోజులు కే.విశ్వనాథ్ పేరు నిలిచి ఉంటుందని సీఎం అన్నారు. కవి పండితులకు జనన మరణాల భయం వుండదని, వారి కీర్తి అజరామరం అని,
“జయన్తి తే సుకృతినో.. రససిద్ధాః కవీశ్వరాః ..నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయమ్..”అనే వాక్కు విశ్వనాథ్ కు వర్తిస్తుందన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.