నగరంలో బస్తీ దవాఖాన ప్రారంభం

నగరంలో బస్తీ దవాఖాన ప్రారంభం

నగరంలో బస్తీ దవాఖాన ప్రారంభం

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ పుట్టిగుట్టలో రూ.14లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా అస్పత్రి ఆవరణలో మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. అనంతరం రూ.40లక్షలతో కోమటిపల్లి మెయిన్ రోడ్డు నుండి శివ సాయి ట్రస్ట్ వరకు నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారు.పేదలకు వారి బస్తీలలోనే ప్రభుత్వ వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. బస్తీ దవాఖానల ద్వారా మంచి వైద్యంతో పాటు పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యం అందుతుందని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం కోసం, పేద ప్రజలకు ఇంటి వద్దే ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. బస్తీ దవాఖానల్లో అవుట్​ పేషెంట్​ సేవలు అందించడంతో పాటు బీపీ, షుగర్‌తో సహా 57 రకాల వైద్య పరీక్షలను చేస్తారని తెలిపారు. అదే విధంగా దవాఖానలో 150రకాల మందులను ఉచితంగా అందిస్తారని పేర్కొన్నారు. స్వల్పంగా అనారోగ్యం బారిన పడిన వారికి తక్షణ వైద్య చికిత్స అందించడంతో పాటు టీకాలు, కుటుంబ నియంత్రణ, వైద్య పరమైన కౌన్సిలింగ్ ఇస్తారన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సిరంగి సునీల్ కుమార్, జక్కుల రజిత వెంకటేశ్వర్లు, గుగులోత్ దివ్యారాణి రాజు నాయక్, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.