మాతృభాషను మరవొద్దు : సీజేఐ ఎన్వీ రమణ

మాతృభాషను మరవొద్దు : సీజేఐ ఎన్వీ రమణహనుమకొండ జిల్లా : కాకతీయ రాజులు అందించిన ఘనమైన వారసత్వానికి ధీటుగా హనుమకొండ నూతన కోర్టు భవనాల సముదాయం తీర్చిదిద్దబడిందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యేకత ఉందని గుర్తు చేశారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇచ్చి కోర్టు భవనాలను నిర్మించిందన్నారు. న్యాయ వ్యవస్థకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గౌరవం ఇదని వివరిస్తూ ఎన్వీ రమణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు.మాతృభాషను మరవొద్దు : సీజేఐ ఎన్వీ రమణహనుమకొండలో 10 కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించిన సందర్భంగా చారిత్రక వరంగల్ నగరానికి ఉన్న చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని, వరంగల్ తో తనకున్న అవినాభావ సంబంధాన్ని జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. కాళోజీ స్ఫూర్తితో తెలుగులో మాట్లాడేందుకు సాహసం చేస్తున్నానని చెప్పి మరీ ఉపన్యాసం ప్రారంభించారు. ప్రసంగం ముగిసే వరకు తెలుగులోనే మాట్లాడి మాతృభాషపై తనకున్న మక్కువను చాటుకున్నారు.

వరంగల్ పట్టణానికి తనకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. వరంగల్ ఆత్మీయమైన నగరం, వరంగల్ ఒక చారిత్రాత్మక నగరం అని గుర్తు చేశారు. వరంగల్ లో దాదాపు 3 సాహిత్య కార్యక్రమాలకు హాజరైనట్లు చెప్పారు. ఇక్కడ తనకు బంధువులు, మిత్రులు ఉన్నట్లు చెప్పారు. వరంగల్ రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో రాష్ట్రంలోనే ప్రముఖ స్థానంలో ఉందని, ప్రగతి శీల ఉద్యమాలకు నెలవు వరంగల్ అని కొనియాడారు.

మాతృభాషను మరిచిపోవద్దని ఎన్వీ రమణ విజ్ఞప్తి చేశారు. మీ పిల్లలతో తెలుగులోనే మాట్లాడాలని కోరారు. మాతృభాషను గౌరవించాలని పేర్కొన్నారు. ఇక వరంగల్ లో మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోర్టుల సముదాయాన్ని నూతనంగా నిర్మించుకునేలా చర్యలు తీసునేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సీజే రమణ తెలిపారు.