జగ్గన్న రూటే సపరేటు! 

జగ్గన్న రూటే సపరేటు!

జగ్గన్న రూటే సపరేటు! 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : ఒకప్పుడు సీఎం కేసీఆర్ పై ఒంటికాలిపై లేచిన జగ్గారెడ్డి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత సీఎం కేసీఆర్ పై జగ్గన్న ఎప్పుడూ ఘాటైన విమర్శలు చేయలేదు. ఇక ఈ మధ్య అయితే పరిస్థితి మరింత మారింది. అంశాల వారీగా స్పందిస్తున్నారు తప్ప కేసీఆర్ సర్కారుపై మాత్రం నామామాత్రపు విమర్శలతోనే సరిపెడుతున్నారు.

* హాట్ టాపిక్ గా మారిన ఇద్దరి భేటీ
ఈ పరిణామాలే అనుమానాలకు తావిస్తున్నాయంటే, ఈ మధ్య మరో కీలకమైన డెవలప్ మెంట్ జరిగింది. జగ్గారెడ్డి అనూహ్యంగా సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. అసెంబ్లీ హాల్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన జగ్గారెడ్డి అభివ్రుద్ధి పనులకు సంబంధించి చర్చించారు. సంగారెడ్డి వరకు మెట్రోను వేయాలని, దళితబంధు లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని కోరారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ అభివృద్ధి పనుల పేరుతో ఇంకేమైనా జరిగిందా అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.

సీఎం కేసీఆర్ ను జగ్గారెడ్డి కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ టైమ్ ఇవ్వడం చాలా అరుదు. అలాంటిది జగ్గారెడ్డికి టైమ్ ఇచ్చారంటే దీని వెనుక ఏదైనా కారణం ఉందా అన్న చర్చ జరుగుతోంది.

జగ్గన్న రూటే సపరేటు!  *రేవంత్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికేనా జగ్గాతో భేటీ
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల పాదయాత్ర మొదలుపెట్టారు. చాలామంది పార్టీ సీనియర్ నేతలకు పాదయాత్రపై సరైన సమాచారం లేదని టాక్. అసలు పాదయాత్రకు సీనియర్లను ఆహ్వానించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే పాదయాత్రలో రేవంత్ రెడ్డి ఒక్కడే పాల్గొంటున్నారు. అంతా తన భుజస్కందాలపై వేసుకుని నడుస్తున్నారు. ఈ తరుణంలో రేవంత్ కు ఝలక్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ను జగ్గన్న కలిసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సీఎం కేసీఆర్ ను కలవడం వెనక మరో కారణం కూడా ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. రేవంత్ పాదయాత్రకు పెరుగుతున్న ఇమేజీకి అడ్డుకట్ట వేసేందుకే ఈ భేటీ జరిగిందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రేవంత్ పాదయాత్రపై నుంచి ద్రుష్టి మరల్చేందుకే ఈ భేటీ జరిగిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

*జగ్గన్నపై హైకమాండ్ గుర్రు..
సీఎం కేసీఆర్ ను జగ్గారెడ్డి కలవడంపై కాంగ్రెస్ హైకమాండ్ కు సమాచారం వెళ్లిందట. ఎన్నికల ముంగిట ఈ భేటీలు ఏంటని పార్టీ పెద్దలు ఆరా తీసినట్లు సమాచారం. అయితే ఈ ప్రశ్నలకు జగ్గారెడ్డి సమాధానం ధీటుగా చెబుతున్నారు. ప్రధాని మోడీని, కాంగ్రెస్ ఎంపీలు కలిస్తే తప్పు లేదు కానీ సీఎం కేసీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే భేటీ కావడం తప్పు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు.

* జగ్గన్న వ్యూహం లక్ష్యాన్ని చేర్చేనా !
సీఎం కేసీఆర్, జగ్గారెడ్డి భేటీపై సంగారెడ్డి నియోజకవర్గంలో మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతోంది. జగ్గారెడ్డి తనకు లైన్ క్లియర్ చేసుకునేందుకు సీఎంను కలిసినట్లు వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్ లో ఉంటూనే, గులాబీ పార్టీపై సైలెంట్ గా ఉండటమే జగ్గన్న వ్యూహమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా మరోసారి విజయం సాధించడమే జగ్గన్న లక్ష్యం. అందుకే సీఎం కేసీఆర్ ను జగ్గారెడ్డి కలిసినట్లు ప్రచారం జరుగుతోంది.

*పార్టీ ఏదైనా జగ్గన్నకు తిరుగేలేదు!
ఒక్కటి మాత్రం నిజం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యేకు ధీటుగా సంగారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయి. జరుగుతున్నాయి. అందుకే జనంలోనూ ఆయనపై వ్యతిరేకత లేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి గట్టి అభ్యర్థి బరిలో ఉంటే తప్ప జగ్గారెడ్డిని ఓడించడం అసాధ్యమని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. మరి నిజంగానే జగ్గారెడ్డి మరోసారి విజయం సాధిస్తారా? లేక బీఆర్ఎస్ సత్తా చాటుతుందా? అన్నది తేలాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.!