హైదరాబాద్ నైపర్ కు జాతీయ హోదా

హైదరాబాద్ నైపర్ కు జాతీయ హోదాన్యూఢిల్లీ : హైదరాబాద్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ , రీసెర్చ్ ( నైపర్ ) కు జాతీయ హోదా లభించింది. హైదరాబాద్ నైపర్ తో పాటు దేశంలోని మరో 5 ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ సంస్థలకు జాతీయ ప్రాధాన్యతను కల్పించే బిల్లును గురువారం రాజ్యసభ ఆమోదించింది.

ఈ బిల్లుకు డిసెంబర్ 6 లోక్ సభ ఆమోద ముంద్ర వేసింది. బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చకు ఆరోగ్యశాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవియా బదులిస్తూ నైపర్లకు జాతీయ ప్రాధాన్యతనివ్వడంతో సహా 4 సవరణలతో బిల్లు రూపొందించామన్నారు.

ఇప్పటివరకు మొహలీ నైపర్ కే జాతీయ హోదా ఉందని, ఆ తర్వాత ఏర్పాటైన మిగతా ఆరు నైపర్లకు జాతీయ ప్రాధాన్యత ఉన్నదో లేదోనన్న సందిగ్దతను తొలగించే క్రమంలో వీటికి హోదా కల్పిస్తూ ఒక సవరణ చేశామని వివరించారు. తాజాగా జాతీయ ప్రాధాన్యత గుర్తింపు లభించిన నైపర్లు హైదరాబాద్, అహ్మదాబాద్, గువహటి , హాజీపూర్ , కోల్ కతా , రాయబరేలీల్లో ఉన్నాయి.

ఇవి అండర్ గ్రాడ్యుయేట్ , డిప్లొమో కోర్సులను ప్రారంభిస్తాయి. వీటికి అడ్వయిజరీ కౌన్సిల్ ను నియమిస్తారు. అలాగే ఈ సంస్థల నిర్వహణను చూసే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుల సంఖ్యను 23 నుంచి 12 కు తగ్గిస్తారు.