జేఎల్ పోస్టులకు నోటిఫికేషన్
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : ఇంటర్మీడియట్ కాలేజీల్లోని జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 16 సబ్జెక్టులకు సంబంధించి 1392 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 16, 2022 నుంచి జనవరి 06, 2023 వరకు దరఖాస్తులు స్వీకరణ, జూన్ లేదా జులైలో ఎగ్జామ్స్ ఉంటాయని తెల్పింది. శుక్రవారం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేఎల్ పోస్టుల భర్తీపై చర్చించింది. అనంతరం నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీజోన్ 1 పరిధిలో 724, మల్టీజోన్ 2 పరిధిలో 668 పోస్టులున్నాయని ప్రకటించింది.
ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పరిధిలో 1523 పోస్టుల భర్తీకి ఈ సంవత్సరం జులై 22న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదం తెల్పింది. వీటిలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులు కాగా, 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 40 లైబ్రేరియన్ పోస్టులున్నాయి. వీటిలో ఫిజికల్ డైరెక్టర్ , లైబ్రేరియన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. చివరిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2008 లో 1100 జూనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేశారు. తెలంగాణలో జేఎల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం ఇదే మొదటిసారి.