రాష్ట్రంలో ఇక 24 గంటలూ దుకాణాలు

రాష్ట్రంలో ఇక 24 గంటలూ దుకాణాలు

రాష్ట్రంలో ఇక 24 గంటలూ దుకాణాలువరంగల్ టైమ్స్. హైదరాబాద్‌: రాష్ట్రంలో దుకాణాలు, సంస్థలు ఇకపై 24 గంటలూ తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. తెలంగాణ దుకాణాలు, సంస్థల చట్టం -1988 కింద నమోదైన సంస్థలన్నిటికీ ఇది తక్షణం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణికుముదిని ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులందరికీ ఐడీ కార్డులివ్వాలని, వారాంతపు సెలవులు, వారానికి పనిగంటలు తప్పనిసరిగా పాటించాలని, అదనపు సమయం పనిచేసినప్పుడు ఓవర్‌టైం వేతనాలివ్వాలని కార్మికశాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వం గుర్తించిన సెలవులు, పండగ వేళల్లో పనిచేస్తే వేతనంతో కూడిన ప్రత్యామ్నాయ సెలవు కల్పించాలని, మహిళా ఉద్యోగులకు భద్రతా చర్యలతో పాటు రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలని సూచించింది. యాజమాన్యాలు ఉద్యోగులు, ఇతర అంశాలకు సంబంధించిన రికార్డులు నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు రిటర్నులు దాఖలు చేయాలని, పోలీసు నిబంధనల మేరకు వ్యవహరించాలని వెల్లడించింది. 24 గంటలూ దుకాణాలు, సంస్థల్ని నిర్వహించేందుకు వార్షిక ఫీజు రూ.10 వేలు చెల్లించాలని సూచించింది.