పోసానిపై దాడికి పవన్‌ అభిమానుల యత్నం

పోసానిపై దాడికి పవన్‌ అభిమానుల యత్నంహైదరాబాద్‌: సినీనటుడు, వైకాపా కార్యకర్త పోసాని కృష్ణమురళి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభిమానుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పోసాని కృష్ణమురళి సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పోసాని ప్రెస్‌క్లబ్‌ వద్దకు వచ్చిన విషయం తెలుసుకున్న పవన్‌ అభిమానులు భారీగా అక్కడి చేరుకున్నారు.

పోసానిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. పోసానికి వ్యతిరేకంగా పవన్‌ అభిమానులు నినాదాలు చేశారు. అరెస్టు చేసిన ఆందోళనకారులను పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోసానిని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లిన పోలీసులు.. అనంతరం పోలీసు వాహనంలోనే ఆయన ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా పోసాని మీడియాతో మాట్లాడుతూ..  ‘‘పవన్‌ అభిమానుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. నేను చనిపోతే అందుకు పవన్‌ కల్యాణే కారణం. అతనిపై రేపు పోలీసులకు ఫిర్యాదు చేస్తా’’ అని తెలిపారు.