తెలంగాణ వారందరికీ గర్వకారణము: ఎర్రబెల్లి

తెలంగాణ వారందరికీ గర్వకారణము: ఎర్రబెల్లి

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లికి ఉత్తమ పర్యాటక గ్రామంగా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ భూదాన్ పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. భూదాన ఉద్యమానికి, చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన భూదాన్ పోచంపల్లి ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేయడం తెలంగాణ వారందరికీ గర్వకారణమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

పోచంపల్లి గ్రామానికి ఈ ఘన కీర్తి దక్కడం సీఎం కేసీఆర్ కృషి వల్లే సాధ్యం అయిందని ఆయన అన్నారు. భూదానోద్యమం వల్ల పోచంపల్లి గ్రామం భూదాన్ పోచంపల్లి గా మారిందని ఆయన అన్నారు. పోచంపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధికి, సిల్క్ ఆఫ్ ఇండియాగా పోచంపల్లి పేరు సంపాదించడానికి, పోచంపల్లిలో నేసే ఇక్కత్ చీరలకు అంతర్జాతీయ గుర్తింపు రావడానికి సీఎం కేసీఆర్ గణనీయమైన కృషి చేశారని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా పోచంపల్లి గ్రామ ప్రజలకు మంత్రి అభినందనలు తెలిపారు. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న ప్రపంచ పర్యాటక సంస్థ భూదాన్ పోచంపల్లిని ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసిందని ఆయన తెలిపారు. భారతదేశం నుండి మూడు గ్రామాలు పోటీపడగా, భూదాన్ పోచంపల్లి ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికయింది. డిసెంబర్ 2వ తేదీన స్పెయిన్ లోని మాడ్రిడ్ లో భూదాన్ పోచంపల్లి గ్రామానికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.