కొత్త జోనల్‌ వ్యవస్థ ప్రకారం రోస్టర్‌ పాయింట్లు

కొత్త జోనల్‌ వ్యవస్థ ప్రకారం రోస్టర్‌ పాయింట్లు

వరంగల్ టైమ్స్ ,హైదరాబాద్ : ఉద్యోగాల భర్తీకి సంబంధించి కొత్త జోనల్‌ వ్యవస్థకు అనుగుణంగా రోస్టర్‌ పాయింట్లను నిర్ధారించాలని ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త జోనల్‌ వ్యవస్థకు సంబంధించి ‘తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ లోకల్‌ కేడర్స్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ రికూ్ట్రట్‌మెంట్‌) ఆర్డర్‌-2018’ను 2018 ఆగస్టు 30 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ జోనల్‌ వ్యవస్థ ప్రకారం 33 జిల్లాలు, 7 జోన్లు, రెండు మల్టీ జోన్ల ఆధారంగా జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ కేడర్లవారీగా పోస్టులను వర్గీకరించింది. దీంతో గతంలో జిల్లా కేడర్‌లో ఉన్న కొన్ని రకాల పోస్టులు జోనల్‌ కేడర్‌కు, మరికొన్ని మల్టీ జోనల్‌కు మారాయి.కొత్త జోనల్‌ వ్యవస్థ ప్రకారం రోస్టర్‌ పాయింట్లు

ఆ పోస్టుల ‘యూనిట్‌ ఆఫ్‌ అపాయింట్‌మెంట్‌’ కూడా మారింది. ఏ పోస్టు ఏ ‘యూనిట్‌ ఆఫ్‌ అపాయింట్‌మెంట్‌’కిందకు మారిందో.. దాని ఆధారంగా ఉద్యోగాల రోస్టర్‌ పాయింట్లను నిర్ధారించాలని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది.యూనిట్‌ ఆఫ్‌ అపాయింట్‌మెంట్‌ మారకపోతే పాత రోస్టర్‌ పాయింట్లనే కొనసాగించాలని నిర్ధేశించింది. అంటే 100 రోస్టర్‌ పాయింట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, దివ్యాంగుల వర్గాల రిజర్వేషన్లకు అనుగుణంగా పోస్టులను కేటాయించాల్సి ఉంటుంది.  ఇదివరకు జిల్లా కేడర్‌లో ఉన్న ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ పోస్టులు ఇప్పుడు జోనల్‌ పోస్టులుగా మారాయి. వీటికీ కొత్త రోస్టర్‌ పాయింట్లను నిర్ధారించాల్సి ఉంటుంది.