ఆదాయార్జనలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు 

ఆదాయార్జనలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రైల్వే మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన వినూత్న విధానాలు, జోన్ లో నిత్యావసర వస్తువుల సరఫరా సజావుగా సాగేందుకు కేంద్రీకృత విధానాలను కఠినతరం చేయడం ఫలితంగా దక్షిణ మధ్య రైల్వే పార్సిల్ రంగంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. 2020 -2021 సంవత్సరంలో పార్సిల్ లో వార్షిక ఆదాయం మొత్తం రూ. 103 కోట్లు కాగా, కరోనా మహమ్మారి తెచ్చిన సవాళ్లను అధిగమిస్తూ పార్సిల్స్ లో 4.78 లక్షల టన్నుల సరుకు రవాణా వల్ల రూ. 200 కోట్ల ఆదాయాన్ని సౌత్ సెంట్రల్ రైల్వేస్ సాధించింది. భారతీయ రైల్వేలో పార్శిల్ స్థలం కోసం అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం, షెడ్యూల్ ప్రకారం రైళ్లను నడపడం స్నేహపూర్వక విధానాలతో ఇది సాధ్యమైంది.ఆదాయార్జనలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు కొత్త పార్శిళ్లను కొనుగోలు చేయడం, రోడ్డు పార్సిల్స్ ను రైలు రవాణాకు మళ్లించడం వంటివి పార్సిల్ రంగంలో వృద్ధికి ఊతంగా మారాయి. వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయడంలో, దేశ రాజధానికి పాలను రవాణా చేయడంలో ఈ సేవలు కీలక పాత్ర పోషిస్తాయి. 473 కిసాన్ ప్రత్యేక రైళ్లు 1.57 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసి రూ. 72.67 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. పాల సరఫరా ద్వారా రూ. 34.03 కోట్లు, నాన్ లీజ్ ట్రాఫిక్ ద్వారా రూ. 73. 62 కోట్లు, స్పేస్ లీజింగ్ ద్వారా రూ. 20.08 కోట్లు ఆర్జించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ వెల్లడించారు.

కరోనా కారణంగా దక్షిణ మధ్య రైల్వే అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ వాటిని ఇప్పుడిప్పుడే అధిగమిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణాలో మరో అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. ఇది 2021-2022 లో 112.51 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసి రికార్డు స్థాయిలో రూ.10వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అన్ని రకాల సరుకుల లోడిరగ్ అధిక స్థాయిలో జరుగడంతో అన్ని రంగాల్లోనూ సరుకు రవాణాలో వృద్ధి సాధించింది. గత ఆర్థిక సంవత్సరం 2020-2021తో పోలిస్తే సరుకు రవాణా ఆదాయంలో 17.7 శాతం పెరుగుదల, 17.03 శాతం అధిక లోడ్ సాధించింది. 53.78 మెట్రిక్ టన్నుల బొగ్గు, 7.980 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు, 5.925 మెట్రిక్ టన్నుల ఎరువులు, 4.13 మెట్రిక్ టన్నుల ముడిసరుకుతో కూడిన సరుకును దక్షిణ మధ్య రైల్వే రవాణా చేసింది.