ఢిల్లీ : పీవీ మాటలను ఆదర్శంగా తీసుకునే నేను రాజకీయాల్లో ఎదిగానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దివంగత మాజీ ప్రధాని పీవీ 17వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని అంబేద్కర్ హాలులో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు, ఎంపీలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పీవీ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అఖండ భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఒకే ఒక్క తెలుగువాడు, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని మంత్రి ఎర్రబెల్లి గుర్తు చేశారు. దేశానికి ఆయన చేసిన సేవలను మంత్రి ఎర్రబెల్లి కొనియాడారు.
2020, జూన్ 28 నుండి 2021 జూన్ 28 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీవీ శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించిందని ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తు చేశారు. ఒక్క తెలంగాణలోనే కాదు ప్రపంచంలోని 50 దేశాలలో ఈ ఉత్సవాలను నిర్వహించారు.
పీవీకి భారత రత్న ఇవ్వాలని, వారి చిత్ర పటాన్ని పార్లమెంటులో పెట్టాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. ఇప్పుడు ఢిల్లీ వేదికగా కేసీఆర్ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరారు.
మంత్రి ఎర్రబెల్లితో పాటు మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే, ఎంపీలు సురేష్ రెడ్డి, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య, డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, మన్నే శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్ నేత తదితరులు పీవీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.