2 నెలల్లోనే థర్డ్ వేవ్ ముగిసింది: హెల్త్ డైరెక్టర్

2 నెలల్లోనే థర్డ్ వేవ్ ముగిసింది: హెల్త్ డైరెక్టర్వరంగల్ టైమ్స్, హైదరాబాద్: ప్రభుత్వ నిబంధనలు, జాగ్రత్తలతో కరోనా నుంచి బయటపడ్డామని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు అన్నారు. ఫీవర్ సర్వే మంచి ఫలితాలు ఇచ్చిందని చెప్పారు. వారం రోజుల్లోనే మొదటి విడత ఫీవర్ సర్వే పూర్తవుతుందని పేర్కొన్నారు. రెండు నెలల్లోనే థర్డ్ వేవ్ ముగిసిందన్నారు. కరోనా నుంచి త్వరగా బయటపడటానికి వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేసిందని వెల్లడించారు. భవిష్యత్ లో ఎలాంటి వేరియంట్ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రెడీగా ఉందన్నారు. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయవచ్చని చెప్పారు.

సమ్మక్క, సారలమ్మ జాతరలో వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. మొదటి డోస్ వ్యాక్సిన్ 100 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. రెండో డోస్ 82 శాతం పూర్తైందని తెలిపారు. టీనేజ్ వ్యాక్సిన్ మొదటి డోస్ 73 శాతం పూర్తైందని వెల్లడించారు. కొత్త వేరియంట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని అన్నారు. కరోనాను రానున్న రోజుల్లో సాధారణ ఫ్లూగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందన్నారు. కరోనా డెంగ్యూలా ఎప్పటికీ ఎఫెక్ట్ చేసేలా మారవచ్చని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.