ముగ్గురు చైన్‌ స్నాచర్లు అరెస్టు

ముగ్గురు చైన్‌ స్నాచర్లు అరెస్టు

వరంగల్ టైమ్స్, శ్రీకాకుళం : జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన వ్యక్తులను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.వారి నుంచి సుమారు రూ.15.15 లక్షల విలువైన నగలను స్వాధీనపర్చుకున్నారు. ఇరానీ గ్యాంగ్‌ సభ్యుడు బసు ఆలీ, ఒడిశాకు చెందిన హైదర్‌ ఆలీలు, మరో నిందితుడు సూరాడ రాజును పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఆదివారం జిల్లా ఎస్‌పి జి.రాధిక విలేకర్ల సమావేశంలో చైన్‌ స్నాచర్ల వివరాలను వెల్లడించారు. నగరంలోని సౌతిండియా షాపింగ్‌ మాల్‌ వద్ద ఈ ఏడాది మే 19వ తేదీ ఉదయం 10.30 గంటల సమయంలో ఓ మహిళ మెడలో నుంచి 11తులాల విలువైన బంగారు ఆభరణాలను పల్సర్‌ బైక్‌ వచ్చిన ఇరానీ గ్యాంగ్‌కు చెందిన హైదర్‌ ఆలీ, తాలిబన్‌ ఆలీ దొంగిలించారు.ముగ్గురు చైన్‌ స్నాచర్లు అరెస్టుఅదే రోజున ఇచ్చాపురంలో వీరిద్దరు బైక్‌పై మరో మహిళ మెడలో రెండు తులాల బంగారు నగలను దొంగిలించారని వివరించారు. ఈ రెండు కేసుల్లో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. ఆదివారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నిందితుల్లో ఒకరైన బసు ఆలీ, ఆయన స్నేహితుడు ఒడిశాకు చెందిన హైదర్‌ ఆలీతో చైన్‌ స్నాచింగ్‌కు వినియోగించిన పల్సర్‌ వాహనం ఒడి 34పి 9569 నంబరుతో వస్తుండగా పట్టుకుని విచారించినట్టు వెల్లడించారు.

నిందితుల నుంచి సుమారు రూ.5.58 లక్షల విలువ గల 127.6 గ్రాముల బంగారం, పల్సర్‌ వాహనాన్ని స్వాధీన పరచుకున్నట్టు తెలిపారు. అయితే వారిని శ్రీకాకుళం టూటౌన్‌ సిఐ ప్రసాద్‌ , ఎస్‌ఐ వెంకటేష్‌ ఇతర సిబ్బంది వారిని పట్టుకున్నట్టు వివరించారు. ఈ కేసులో మరో సభ్యుడు తాలిబాన్‌ ఆలీ కోసం గాలిస్తున్నట్లు ఎస్‌పి వివరించారు. జిల్లాలోని ఏడు పోలీసు స్టేషన్లతో పాటు ఒడిశా రాష్ట్రం గురండి పోలీసు స్టేషన్‌ పరిధిలో 13 చైన్‌ స్నాచింగ్‌ దొంగతనాలకు పాల్పడ్డ సూరాడ రాజును మెళియాపుట్టి పోలీసులు అరెస్టు చేశారని వివరించారు. నిందితుడు రాజు అండమాన్‌ వాసి అని చెప్పారు. సోంపేట మండలం బట్టి గల్లూరు గ్రామంలో తన మేనమామ ఇంటికి వచ్చి స్థిరడిన రాజు గడచిన రెండేళ్లుగా 13 చోట్ల చోరీలకు పాల్పడినట్టు తెలిపారు.

ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని నిందితుడు ఈ చోరీలకు పాల్పడినట్టు తెలిపారు. మెళియాపుట్టిలో ఈ ఏడాది ఆగస్టులో నాలుగు కేసులు నమోదు కాగా, ఇచ్చాపురంలో ఒకటి, కవిటి, కాశీబుగ్గల్లో రెండేసి, మందసలో ఒకటి, వజ్రపుకొత్తూరులో ఒకటి, నౌపడలో ఒకటి, గురండిలో ఒక కేసు నమోదైనట్టు తెలిపారు. మెళియాపుట్టి ఆల్‌ ఆంధ్రా రోడ్డులో ఆదివారం పాతపట్నం సిఐ వినోద్‌బాబు, మెళియాపుట్టి ఎస్‌ఐల ఆధ్వర్యాన వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా రాజు పట్టుబడినట్టు తెలిపారు. ఆయన వద్ద నుంచి సుమారు రూ.9.57 లక్షల విలువైన 20 తులాల బంగారు నగలతో పాటు హీరోహోండా వాహనాన్ని స్వాధీన పరచుకున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా సంబంధిత పోలీసులను ఆమె అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్‌పి విఠలేశ్వర్‌ పాల్గొన్నారు.