తూర్పులో త్రికోణపు పోటీ..నెగ్గేది ఎవరంటే! 

తూర్పులో త్రికోణపు పోటీ..నెగ్గేది ఎవరంటే!

తూర్పులో త్రికోణపు పోటీ..నెగ్గేది ఎవరంటే! 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈస్ట్ సీటు హాట్ సీటుగా మారింది. బీఆర్ఎస్ నుంచి నన్నపునేని నరేందర్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు రేసులో ఉన్నారు. ఈ ఇద్దరికీ టఫ్ ఫైట్ ఇస్తానంటూ కొండా సురేఖ కూడా రేసులోకి వచ్చారు. దీంతో ఈ త్రికోణపు పోటీ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.

*అద్భుతం జరిగితే తప్ప.. నన్నపునేని గెలపు కష్టమే!
పార్టీల వారీగా ఈస్ట్ నియోజకవర్గంలో బలాబలాలను విశ్లేషిస్తే నన్నపునేని నరేందర్ ప్రజల నుంచి గట్టి వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో పోలిస్తే, ఈస్ట్ లో నరేందర్ ప్రజల్లోకి వెళ్లరనే విమర్శ ఉంది. ప్రజల సాధకబాధకాలను ఆయన పట్టించుకోరనే మాట బలంగా వినిపిస్తోంది. నియోజకవర్గంలోని అధికారిక కార్యక్రమాలకు హాజరుకావడం తప్ప ప్రజల సమస్యలు ఆయనకు పట్టవనే ప్రచారం కూడా జరుగుతోంది.

అంతేకాదు సమస్యల పరిష్కారం కోసం ఎవరైనా నరేందర్ దగ్గరకు వెళ్తే ఆయన లైట్ తీసుకుంటారట. ఇంటి దగ్గర వెయిట్ చేసి, చేసి విసుగు రావాలి తప్ప నరేందర్ నోటి నుంచి మాత్రం ప్రజలకు భరోసా ఇచ్చే ఒక్క మాట కూడా రాదట. ఏదైనా ఎన్నికలప్పుడు చూసుకుందాం అనే తరహాలో నరేందర్ రాజకీయం ఉంటుందట. అందుకే ఇవన్నీ ఈసారి ఆయన కొంప ముంచే ప్రమాదముందని ప్రచారం జరుగుతోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మరోసారి ఆయన గెలవడం దాదాపు అసాధ్యమేనని విశ్లేషకుల అంచనా.

*ప్రజల్లోకి రాని ప్రజాప్రతినిధిగా నరేందర్..
తన పట్ల ప్రజల్లోని వ్యతిరేకత నన్నపునేని నరేందర్ కు అర్థమైపోయిందట. దీంతో కేసీఆర్ బొమ్మతోనే గట్టెక్కాలని ఆయన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గడపగడపకు వెళ్తే ఎక్కడ ప్రజలు నిలదీస్తారోనన్న భయం ఆయనను వెంటాడుతుందట. అందుకే ఇంటిపట్టునే ఉండి కేసీఆర్ బొమ్మతోనే ప్రచారాన్ని మమ అనిపించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు టాక్. ఈ కారణాలతోనే ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలంతా ఇంటింటికీ తిరిగి ప్రజలతో మమేకమవుతుంటే, నరేందర్ మాత్రం బయట చూద్దామన్నా కనిపించడం లేదు. ఇవన్నీ చూస్తుంటే నన్నపునేని నరేందర్ ఓడిపోవడానికి మానసికంగా సిద్ధమైపోయారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

*ఈస్ట్ లో లేటెస్ట్ గా దూసుకుపోతున్న ఎర్రబెల్లి
వరంగల్ ఈస్ట్ లో బీజేపీ తరపున ఎర్రబెల్లి ప్రదీప్ రావు కదం తొక్కుతున్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ లోనూ కనిపించని ఉత్సాహం ఇప్పుడు ఆయనలో కనిపిస్తోంది. మొన్నటిదాకా గులాబీపార్టీలో ఉన్న ఆయన లేటుగా వచ్చినప్పటికీ లేటెస్టుగా దూసుకుపోతున్నారు. ప్రజాసేవా కార్యక్రమాలతో అందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతీ ఒక్క వర్గాన్ని మచ్చిక చేసుకుంటూ, అందరివాడు అనిపించుకుంటున్నారు. ఒక్క ఓటు ఉన్న కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ఎర్రబెల్లి ప్రదీప్ రావు జోరు పెంచారు. విమర్శల రాజకీయాన్ని పక్కనబెట్టి, తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేయగలనో ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజల అభిమానాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అధికారపార్టీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కంటే, ఎర్రబెల్లి ప్రదీప్ రావు సరైన అభ్యర్థి అని ప్రజలంతా అనుకుంటున్నట్లు టాక్.

*ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు హిట్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువే
గతంలో ప్రజారాజ్యం తరపున పోటీచేసి అప్పట్లో అధికార పార్టీ అభ్యర్థికి గట్టి పోటీనిచ్చారు ఎర్రబెల్లి ప్రదీప్ రావు. ఈ సారి గట్టిపోటీ కాకుండా ఏకంగా విజయఢంకా మోగించేలా ప్లానింగ్ చేసుకుంటున్నారు. పనికొచ్చే అనుచరగణాన్ని సెలెక్ట్ చేసుకుని మరీ రాజకీయం చేస్తున్నారు. ప్రజలకు కొండంత ధైర్యాన్ని ఇస్తూ, ఈస్ట్ లో తానే సరైన అభ్యర్థినని నిరూపించుకునే ప్రయత్నంలో ఎర్రబెల్లి ఉన్నారు. అందుకే అన్ని వర్గాల జనంలోనూ ఆయన గురించి సానుకూల అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవన్నీ చూస్తుంటే ఈసారి ఎన్నికల్లో ప్రదీప్ రావు హిట్ కొట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

* తూర్పులో కొండా ఎంట్రీకి కొర్రీలు!
ఓవైపు నన్నపునేని నరేందర్ లో నైరాశ్యం నెలకొని ఉంటే, ఎర్రబెల్లి ప్రదీప్ రావులో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఈ ఇద్దరే పోటీపడతారని అనుకుంటుంటే, సడెన్ గా కొండా సురేఖ రేసులోకి వచ్చారు. ఈస్ట్ నుంచి కొండా సురేఖ బరిలో ఉంటారని కొండా మురళి ప్రెస్ మీట్ లో ప్రకటించారు. అయితే ఆమెకు సానుకూల వాతావరణం అయితే కనిపించడం లేదు.కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడమే మైనస్ అనుకుంటే, కొండా సురేఖపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో పరిస్థితి మరింత దీనంగా తయారైంది. గతంలో ఓసారి ఆమె ఎమ్మెల్యేగా ఈస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటికీ అప్పట్లో ఆమె వ్యవహరించిన తీరును ప్రజలు మరిచిపోలేకపోతున్నారట. అప్పట్లో అధికారపార్టీ టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఉండి ఏమీ చేయలేకపోయిన కొండా సురేఖ, ఇప్పుడు గడ్డుపరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఏం చేస్తారన్న చర్చ జరుగుతోంది.

* హస్తం టిక్కెట్ ఇచ్చినా..కొండా గెలుపు కష్టమే..
అంతేకాదు కొండా కుటుంబ రాజకీయాలకు ఇక కాలం చెల్లిందనే మాట కూడా బలంగా వినిపిస్తోంది. నయానో భయానో ఓట్లేసే కాలం ఇది కాదని, అభివృద్ధినే ప్రజలు కోరుకునే రోజులివని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. కాబట్టి కొండా సురేఖ శకం ముగిసినట్లేనని ప్రచారం జరుగుతోంది. అందుకే ఈస్ట్ లో కొండా సురేఖ మూడోస్థానానికి పరిమితం కావొచ్చన్న మాట వినిపిస్తోంది. మరీ కష్టపడితే నన్నపునేని నరేందర్ ను మూడో స్థానానికి నెట్టి, ఆమె రెండోస్థానానికి చేరుకునే అవకాశముందట. అంతేకానీ కొండా సురేఖ అస్సలు గెలిచే పరిస్థితే లేదన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది.

మొత్తంగా వరంగల్ ఈస్ట్ లో ఇప్పుడు బీజేపీ రేసులో ఉంది. ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రజలకు ఏం కావాలో,ఏం చేయగలనో వివరిస్తూ సాగిపోతున్నారు. నన్నపునేని నరేందర్ మాత్రం ఏమీ చేయలేక ఈస్ట్ ప్రజల విమర్శలను ఎదుర్కుంటున్నారు. ఇక కొండా సురేఖ గురించి ప్రజల్లో అప్పుడే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఈ తరుణంలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఈస్ట్ ప్రజలకు ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. అందుకే ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు గెలిచి తీరుతారన్న ప్రచారం జరుగుతోంది. అన్నివర్గాల అండ ఉంది కాబట్టే ఆయన జెండా పాతడం ఖాయమేనంటున్నారు విశ్లేషకులు. ప్రదీప్ రావు విజయం ఖాయమేనని, ఇక తేలాల్సింది మెజార్టీయేనని తేల్చిచెబుతున్నారు.!!