యాదాద్రీ చరిత్రలో నిలిచిపోతుంది: ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

యాదాద్రీ చరిత్రలో నిలిచిపోతుంది: ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి, భ‌క్తుల‌కు మెరుగైన వ‌స‌తుల క‌ల్ప‌న‌, ఆల‌య భూముల ప‌రిరక్షణ కోసం ప్ర‌భుత్వ స‌హాకారంతో దేవాదాయ శాఖ ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. శ‌నివారం శాసనసభలో దేవాదాయ శాఖ‌ పద్దుపై చర్చ సందర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ప‌లువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.యాదాద్రీ చరిత్రలో నిలిచిపోతుంది: ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డితెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత సీఎం కేసీఆర్ సార‌ధ్యంలో అన్ని రంగాలు సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నాయన్నారు. దేవాదాయ, ధ‌ర్మాదాయ శాఖ ఆద్వ‌ర్యంలో దేవాలయాలకు పూర్వ వైభవం వ‌చ్చిందని తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అద్భుతంగా అభివృద్ధి చెందడమే కాకుండా భక్తుల మన్ననలను అందుకుంటుందని ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో ఉన్న ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాల‌తో పాటు గ్రామ స్థాయి వ‌ర‌కు అన్ని ఆలయాలు అభివృద్ది చెందుతున్నాయని పేర్కొన్నారు.

2022వ సంవత్సరం యాదాద్రీశుడి ఆలయం చరిత్రలో నిలిచిపోతుంద‌న్నారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణతో స్వయంభువుల దర్శన భాగ్యం భక్తులకు కలుగనుందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నానని స‌భ‌లో ప్ర‌క‌టించారు. ప్రపంచ స్థాయి ఆథ్యాత్మిక క్షేత్రంగా రూపుదాల్చిన పంచ నారసింహుల దివ్యక్షేత్రం యాదాద్రి, ఆధ్యాత్మికత, సంప్రదాయ, ఆధునిక హంగులు అద్దుకుంటోందని వివ‌రించారు.

యాదాద్రి వైభవం నలుదిక్కులా చాటేలా పునర్నిర్మాణం చేశామని సగర్వంగా ప్రకటిస్తున్నామ‌ని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రి పునఃనిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలిపారు. ప్రతీ పనిని స్వయంగా పర్యవేక్షించారని, ప్రతీ విషయంపైనా అధికారులకు సలహాలు సూచనలు చేశారని తెలిపారు.

మ‌రోవైపు ఉమ్మ‌డి పాల‌న‌లో మ‌న ప్రాంత ఆల‌యాల‌కు కేవ‌లం రూ 79.12 కోట్ల‌తో మొత్తం 691 ఆల‌యాల‌ అభివృద్ధి ప‌నులు చేప‌ట్టార‌ని, తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డ‌ త‌ర్వాత కామ‌న్ గుడ్ ఫండ్, ప్ర‌త్యేక అభివృద్ది నిధుల ద్వారా రూ. 342.85 కోట్లతో 1612 ఆలయాల అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని స‌భ దృష్టికి తెచ్చారు. దేవాలయాల భూములను సంరక్షించేందుకు దేవాదాయ శాఖ కఠినమైన చర్యలను తీసుకుంటుంద‌న్నారు. ఇప్పటి వరకు 4175.27 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దేవాలయ భూముల వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖలో నిషేధిత భూముల జాబితాలో చేర్చి దేవుడి మాన్యాలను పరాధీనం కాకుండా చూస్తున్నామని వివ‌రించారు.