పులివెందులకు సీఎం వరాల జల్లులు

పులివెందులకు సీఎం వరాల జల్లులుకడప జిల్లా : ఏపీ సీఎం వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం పులివెందుల నియోజకవర్గంలో పర్యటించారు. పులివెందుల ఇండస్ట్రియల్ పార్క్ లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ కంపెనీ ద్వారా సుమారు 2 వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని సీఎం తెలిపారు.

ఒక్క పులివెందులలోనే భవిష్యత్తులో 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. అంతకుముందు జగనన్న హౌసింగ్ కాలనీకి చేరుకుని అక్కడ హౌసింగ్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు.

జగనన్న కాలనీలో 8042 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల కార్యక్రమం కోర్టు కేసుల కారణంగా ఆలస్యమైందని, పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మిస్తున్నామన్నారు. ఒక్కో ఇంటికి పట్టా విలువ కనీసం రూ.2లక్షలు ఉంటుదని తెలిపారు. వీటితో పాటు జగనన్న కాలనీకి సమీపంలోనే ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సీఎం ప్రకటించారు.

నియోజకవర్గంలో ఆక్వా హబ్ సహా అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. పులివెందులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కు రూ.100 కోట్లు కేటాయించామని , పులివెందులలో రూ.65 కోట్లతో సమగ్రనీటి పథకం, నియోజకవర్గంలో ప్రతీ ఇంటికి మంచినీటి సరఫరా అందిస్తామన్నారు. ప్రతీ మండలానికి మార్కెటింగ్ గిడ్డంగి నిర్మాణం చేపడతామని సీఎం చెప్పారు.