కొత్తగూడెం నుంచి డీహెచ్ ఔట్!!
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరీ : తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస రావు గురించి పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రజలకు ఆయన కీలక సూచనలు చేశారు. దీంతో ఆయనకు ప్రజల్లో మంచి పేరొచ్చింది. ఇంతకు ముందు పనిచేసిన డీహెచ్ ల లాగా తెరవెనుకే ఉండిపోకుండా కరోనా సమయంలో శ్రీనివాస రావు ప్రత్యేక చొరవ చూపి గుర్తింపును తెచ్చుకున్నారు.
*బీఆర్ఎస్ టికెట్ కు ఆశావహులు ఎక్కువే
కొత్తగూడెం నుంచి వనమా వెంకటేశ్వరరావుకు మరోసారి టికెట్ ఇవ్వకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ టికెట్ ను ఆశించే వారి సంఖ్య పెరుగుతోంది. డాక్టర్ గడల శ్రీనివాస రావు ఇక్కడి నుంచి గులాబీ టికెట్ ను ఆశిస్తున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కొత్తగూడెంలో నిర్వహించే సామాజిక సేవ కార్యక్రమాల్లో శ్రీనివాస్ రావు చురుగ్గా పాల్గొంటుండడంతో ఆయనకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్ తోనూ ఆమధ్య ఫోటోలు దిగడంతో టికెట్ హామీ లభించిందేమోనన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. శ్రీనివాస రావు అభ్యర్థిత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ కొత్తగూడెం నుంచి బీజేపీ అభ్యర్థిగా పొంగులేటి దిగబోతున్నారన్న ఊహాగానాలతో పరిణామాలు మారిపోయినట్లు తెలుస్తోంది.
*ఈ రేసులో వద్దిరాజుకే ఎక్కువ ఛాన్స్
పొంగులేటి లాంటి బలమైన అభ్యర్థిని కొట్టాలంటే బీఆర్ఎస్ నుంచి గట్టి అభ్యర్థిని నిలబెట్టే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. అందుకోసం పలు పేర్లను హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు లాంటి వారు రేసులో ఉన్నట్లు టాక్. సీఎం కేసీఆర్ మాత్రం ఆర్థిక, అంగ బలం ఉన్న అభ్యర్థినే ఫైనల్ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ రేసులో వద్దిరాజు రవిచంద్రకే ఎక్కువ అవకాశం ఉందన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే వెంకట్రావు, రేగా కాంతారావుతో పోలిస్తే రవిచంద్ర ఆర్థికంగా బలమైన నాయకుడు.
మరోవైపు కొత్తగూడెం నుంచి ఎంపీ రవిచంద్ర పేరు వినిపించడానికి పలు ఇతర కారణాలున్నాయి. ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు కొత్తగూడెంతో మంచి సంబంధాలున్నాయి. వ్యాపారపరంగానూ బాగా పరిచయాలున్నాయి. దీనికితోడు పార్టీల కతీతంగా స్నేహితులున్నారు. గట్టి క్యాడర్ ఉంది. ఆర్థికంగా బలమైన నాయకుడు కావడంతో పొంగులేటికి వద్దిరాజు రవిచంద్ర అయితేనే మంచిదని హైకమాండ్ కూడా ఆలోచిస్తున్నట్లు టాక్.
*ఈ రేసు నుంచి డీహెచ్ తప్పుకున్నాడా!
ఈసారి కొత్తగూడెం బీఆర్ఎస్ టికెట్ రేసులో నిన్న మొన్నటిదాకా డీహెచ్ గడల శ్రీనివాస రావు పేరు వినిపించింది. ఎప్పుడైతే బీజేపీ అభ్యర్థిగా పొంగులేటి పేరు తెరపైకి వచ్చిందో పరిస్థితి మారిపోయినట్లు టాక్. ఇక ఈ రేసు నుంచి డీహెచ్ శ్రీనివాస రావు ఔటైనట్లేనని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు స్వయంగా ఆయనే క్లారిటీ ఇచ్చారు. తాను ఉద్యోగానికి రాజీనామా చేయడం లేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను కంటి వెలుగు ఏర్పాట్లలో బిజీగా ఉన్నానని ప్రకటించారు. దీంతో కొత్తగూడెం పోటీ నుంచి శ్రీనివాసరావు ఇక తప్పుకున్నట్లేనని తెలుస్తోంది. తాజా పరిణామాలు కచ్చితంగా వద్దిరాజు రవిచంద్రకే కలిసివస్తాయని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. పొంగులేటి బీజేపీ అభ్యర్థి అయితే బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర గట్టిపోటీ ఇస్తారని కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రవిచంద్రకు టికెట్ దాదాపు ఖాయమైపోయిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.