హుజురాబాద్ ఉపఎన్నికకు గెల్లు శ్రీనివాస్ నామినేషన్

హుజురాబాద్ ఉపఎన్నికకు గెల్లు శ్రీనివాస్ నామినేషన్కరీంనగర్ జిల్లా : హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్ లో ఆయన తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. చరాస్తులు రూ.2,82,402.44 కాగా, స్థిరాస్తుల విలువ రూ.20,00,000గా పేర్కొన్నారు.

ఆయన సంవత్సరం సంపాదన కేవలం రూ. 4.98 లక్షలు. 2020-2021లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ సంపాదన రూ.3.13 లక్షలు ఉండగా, 2021 లో 4.98 లక్షలకు చేరింది. ఆయన భార్య స్వేత సంవత్సరం సంపాదన కూడా కేవలం లక్షల్లోనే ఉంది. 2020-2021లో ఆమె సంపాదన రూ.4.50 లక్షలు ఉండగా, 2021లో 4.60 లక్షలకు చేరింది. తన ఆస్తులు, సంపాదనతో పాటుగా, తనపై ఉద్యమకాలం నుంచి ఉన్న కేసుల వివరాలను కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పొందుపర్చారు.

టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పలు పథకాలు ప్రజల్లో ఆత్మగౌరవాన్ని నింపుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వ పథకాలు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచారని ఆయన చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, ఒంటరి మహిళా సహా అనేక పథకాల వల్ల ప్రజలు ఆత్మగౌరవంతో సాఫీగా జీవిస్తున్నారని ఆయన తెలిపారు. టీ.ఆర్.ఎస్. పార్టీ పెంచి పెద్ద చేసిన తర్వాత ఈటల రాజేందర్ కన్నతల్లి వంటి పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఆయన ఆరోపించారు.

గతంలో టీఆర్ఎస్ పార్టీని చీల్చేందుకు కుట్రలు పన్నిన కాంగ్రెస్ నాయకులు అడ్రస్ లేకుండా పోయారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈటలకు కూడా అదే గతి తప్పదని హెచ్చరించారు. బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని ఆయన దుయ్యబట్టారు. వ్యవసాయం సామాన్యులకు దక్కకుండా చేస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న కేంద్ర నీతి ఆయోగ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పని తీరును మెచ్చుకుందని, అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతోందని నీతి ఆయోగ్ కితాబు ఇచ్చిందని ఆయన తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీ.ఆర్.ఎస్. అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.