రాజశ్యామల యాగం పూర్ణాహుతికి హాజరైన కేసీఆర్
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లోని బీఆర్ఎస్ కార్యాలయం ఆవరణలో ఉదయం రాజశ్యామల యాగం ఋత్విక్కుల వేద మంత్రాల మధ్య ఘనంగా జరిగింది. రాజశ్యామల యాగం పూర్ణాహుతికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి, తమిళనాడు విసికె పార్టీ అధ్యక్షుడు, ఎంపి తిరుమావళవన్ , పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకులు, ఎమ్మెల్సీ కవితతో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యాగం ముగిసిన వెంటనే బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని మధ్యాహ్నం 12:37 నుంచి 12:47 గంటల మధ్య సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించారు.
*బీఆర్ఎస్ గులాబీ మయంగా ఢిల్లీ ఆఫీస్ ప్రాంగణం
ఢిల్లీలో నూతనంగా ప్రారంభమైన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ ప్రాంతం బీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, తెలంగాణ రాష్ట్రం నుండి భారీగా తరలి వచ్చిన గులాబీ నాయకులు, పార్టీ శ్రేణులతో సందడి నెలకొన్నది. జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై భారత్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.