అప్రమత్తంగా ఉండాలి : ఎర్రబెల్లి

అప్రమత్తంగా ఉండాలి : ఎర్రబెల్లి

హనుమకొండ జిల్లా : కరోనా మరో వేవ్ ఘంటికలు మోగుతున్నాయి..పంచాయతీ రాజ్ అధికారులు, ప్రత్యేకించి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని సంబంధిత అధికారులకు మంత్రి ఎర్రబెల్లి సూచించారు. మిగిలి ఉన్న వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డుకు, పల్లె ప్రకృతి వనాలు, పల్లె బృహత్ ప్రకృతి వనాలని పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని చెప్పారు.

పల్లె ప్రగతి, గ్రామీణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, ఉపాధి హామీ, హరితహారం మొక్కల సంరక్షణ వంటి అంశాలపై వరంగల్ – హన్మకొండ లోని తమ క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షనిర్వహించారు. పారిశుధ్య పనులను నిరంతరం నిర్వహించాలని, ఉపాధి హామీ పనులను వినియోగిస్తూ అభివృద్ధి పనులను చేపట్టాలని ఈ సమీక్షలో మంత్రి అధికారులను ఆదేశించారు.

హరిత హరం పథకం కింద నాటిన మొక్కలను సంరక్షించడానికి తౌటం పెట్టి, నీటిని అందించాలని సూచించారు. వంద శాతం మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాల, అంగన్ వాడి కేంద్రాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని చెప్పారు. అలాగే పాఠశాలల్లో కిచెన్ షెడ్లు, టాయిలెట్స్ ని వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పంచాయితీల సీసీ ఛార్జీలు, కిస్తీలు సక్రమంగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలిచేలా పనులు చేపట్టాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షలో మహబూబాబాద్, వరంగల్ జిల్లాల జెడ్పీల సీఈవోలు, డీఆర్డీఓలు, డీపీవోలు, డీఎల్పీఓలు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.