దేశాల్లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..!!

కొత్త వేరియంట్ “డెల్మీక్రాన్” వేగంగా వ్యాప్తి చెందుతుందనే అనుమానాలు..!దేశాల్లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..!!

హైదరాబాద్ : ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో పరిస్థితులు ఎలా ఉంటాయో ఇంకా పూర్తిగా ఓ అంచనాకు రాకముందే పిడుగు లాంటి వార్త వచ్చిపడింది. ఎంతోమంది ప్రాణాలను తీసిన డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్‌తో కలిసి డెల్మీక్రాన్ అనే కొత్త వేరియంట్ ఏర్పడిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వేరియంట్ కారణంగానే అమెరికా, బ్రిటన్‌లో అతి వేగంగా కేసులు నమోదవుతున్నాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

డెల్టా, ఒమిక్రాన్ స్పైక్ ప్రోటీన్ల కలయికతో డెల్మీక్రాన్ వేరియంట్ ఏర్పడిందని మహారాష్ట్ర కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ సభ్యుడైన డాక్టర్ శశాంక్ జోషి డెల్మీక్రాన్ తెలిపారు. డెల్టా, ఒమిక్రాన్‌తో పోలిస్తే ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ డెల్టా వేరియంట్‌తో పోల్చుకుంటే.. ఒమిక్రాన్ వేరియంట్‌ వ్యాప్తి వేగంగా ఉన్నా ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువగా ఉంటుందనే అంచనాలు అందరినీ ఊపిరి పీల్చుకునేలా చేశాయి. కానీ ఇప్పుడు డెల్మీక్రాన్ వేరియంట్‌‌ తెరపైకి రావడంతో అందరిలో ఆందోళన నెలకొంది.

డెల్టా వేరియంట్‌ కారణంగా ఎంతోమంది ప్రాణాలు పోయాయి. మానవ శరీరంపై డెల్టా వేరియంట్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. దాంతో చాలామంది ఆస్పత్రిపాలవడమే కాకుండా ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు. అలాంటి డెల్టా వేరియంట్‌ కలయికతో ఏర్పడే డెల్మీక్రాన్ వేరియంట్ వల్ల ఇంకెంత ప్రమాదం ఉంటుందోనని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం.. డెల్మీక్రాన్ సోకిన వారిలో తీవ్ర జ్వరం, దగ్గు, వాసన, రుచి కోల్పోవడం, తలనొప్పి, గొంతమంట, ముక్కు కారడం వంటి లక్షణాలు ఉంటాయి. డెల్టా, ఒమిక్రాన్, డెల్మీక్రాన్ వల్ల జనవరి, ఫిబ్రవరి నెలల్లో కేసులు చాలా పెరిగే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇప్పటికే మనదేశంలో 358 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

వీటితో పాటు డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో డెల్మీక్రాన్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఏకకాలంలో ఈ వేరియంట్ కేసులు విజృంభిస్తే దేశంలో పరిస్థితి ఎలా ఉంటోందనే భయాందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది.”