ముచ్చింతల్ లో రాజకీయ,ఆధ్యాత్మిక ప్రముఖులు

ముచ్చింతల్ లో రాజకీయ,ఆధ్యాత్మిక ప్రముఖులువరంగల్ టైమ్స్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ చిన‌జీయర్ ఆశ్రమంలో భగవత్ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం 10వ రోజు ఉదయం 6.30 గంటలకు అష్టాక్షరీ మంత్ర పఠనం, ఉదయం 7.30 గంటలకు శ్రీ పెరుమాళ్ స్వామికి ప్రాత:కాల ఆరాధన జరిగింది. ఉదయం 8 గంటలకు వేదపారాయనం చేశారు. అనంతరం శ్రీ లక్ష్మీ పారాయణ మహాయజ్ఞం నిర్వహించారు. శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన 108 దివ్య దేశాల్లో, 36 దివ్య దేశాల ఉత్సమూర్తులకు ప్రాణప్రతిష్ట జరిగింది. స్వయంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి 36 ఉత్సవ విగ్రహాలకు ప్రాణప్రతిష్ట చేశారు. నక్షత్ర, రాశి ఆధారంగా దివ్యదేశ ఉత్సవమూర్తులకు ప్రాణప్రతిష్ట జరుగుతుందని వేద పండితులు వెల్లడించారు. ప్రాణప్రతిష్ట అనంతరం మహాసంప్రోక్షణ, కుంభాభిషేకాలు నిర్వహించారు.

ఇప్పటికే ఈ నెల 7న 108 దివ్యదేశాల్లో 32 దివ్యదేశాల ఉత్సవమూర్తులకు ప్రాణప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే. 10న 20 దివ్యదేశ ఉత్సవమూర్తులకు ప్రాణప్రతిష్ట చేశారు. ఇక 13న 20 దివ్యదేశ ఉత్సవమూర్తులకు ప్రాణప్రతిష్ట చేస్తారు. అటు ఉదయం 10 గంటలకు యాగశాలలో విద్యాప్రాప్తి కోసం హయగ్రీవ ఇష్టి నిర్వహించారు. నేడు ఉదయం 10.30 గంటలకు ప్రవచన మండపంలో శ్రీ లక్ష్మానారాయణ అష్టోత్తర పూజ చేశారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్ణాహుతి చేశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రవచన మండపంలో ప్రముఖులచే ప్రవచనాలు, కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు శ్రీలక్ష్మీ నారాయణ మహాయజ్ఞం జరిగింది. ఇక రాత్రి 9గంటలకు పూర్ణాహుతి జరుగనుంది.

మరోవైపు రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో ప్రతీ రోజు పెద్ద సంఖ్యలో పీఠాధిపతులు , మఠాధిపతులు, ఆచార్యుల రాకతో సందడిగా మారింది. అటు సమతామూర్తి సందర్శనకు కేంద్ర అతిథులు, సామాన్య భక్తుల తాకిడి పెరుగుతోంది. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చి సమతామూర్తిని దర్శించుకుని వెళ్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేత ఆవిష్కరించిన 216 అడుగుల భగవద్రామానుజుల విగ్రహాన్ని దర్శించుకునేందుకు, 108 దివ్యదేశాలను దర్శించుకునేందుకు శుక్రవారం వీవీఐపీలు తరలివచ్చారు.కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, గణపతి సచ్చిదానంద స్వామి, యోగా గురు రాందేవ్ బాబా, తమిళ నాడు గవర్నర్ రవిజీ, డీఆర్డీవో చీఫ్ సతీష్ రెడ్డి, హీరో అల్లు అర్జున్ తదితర ప్రముఖులు ముచ్చింతల్ ఆశ్రమానికి వచ్చారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రముఖుల రాకకోసం నిర్వహకులు, పోలీసులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.