అహ్మదాబాద్: గుజరాత్ తీరంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. పాకిస్థాన్ నుంచి సముద్ర జలాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న మత్తు పదార్థాలను అధికారులు పట్టుకున్నారు. కోస్ట్‌గార్డ్, గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భారత జలాల్లో ప్రవేశించిన పాకిస్థాన్‌కు చెందిన ఫిషింగ్ బోట్‌ను సీజ్ చేశారు.
ఇందులో రూ.400 కోట్ల విలువైన 77 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో ఘటనలో మహారాష్ట్రలోని షోలాపూర్‌లో గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అధికారులు అరెస్టు చేశారు.
వారి నుంచి రూ.1.26 కోట్ల విలువైన 626 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మత్తుపదార్థాలను రెండు కార్లలో కర్ణాటక నుంచి షోలాపూర్ మీదుగా సతారాకు తీసుకెళ్తున్నారని చెప్పారు. మారిజౌనాను తరలిస్తున్న రెండు కార్లను సీజ్ చేశామన్నారు. నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదుచేశామన్నారు.