వివాహ వయసుపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : స్తీ, పురుషులకు ఒకే విధమైన కనీస వివాహ వయసుపై దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. చట్టం చేసేందుకు పార్లమెంటుకు తాము ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది. మరోవైపు వివాహం, విడాకులు, వారసత్వం, భరణం వంటి అంశాలను నియంత్రించే విధంగా అన్ని మతాలకు ఏకరూప చట్టాలను రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్‌లు, పిటిషన్లపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
పురుషులు, మహిళలు ఇద్దరికీ ఒకే విధమైన కనీస వివాహ వయసు ఉండాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం తిరస్కరించింది. దీనిపై చట్టం చేసేందుకు పార్లమెంటుకు అత్యున్నత న్యాయస్థానం మాండమస్ జారీ చేయదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కోర్టులు మాత్రమే రాజ్యాంగ పరిరక్షకులు కాదని, పార్లమెంటుపైనా ఆ బాధ్యత ఉందని గుర్తు చేసింది. ఈ అంశంపై కోర్టులు చట్టం చేయలేవని వివరించింది.
స్త్రీ, పురుషులకు చట్టబద్ధమైన వివాహ వయసులో సమానత్వం కల్పించాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. భారతదేశంలో పురుషులు 21 సంవత్సరాల వయసులో వివాహం చేసుకోవడానికి అనుమతి ఉందని, మహిళలకు మాత్రం వివాహ వయసు 18 సంవత్సరాలని అశ్విని ఉపాధ్యాయ పేర్కొన్నారు. పురుషులతో సమానంగా మహిళల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచాలని కోరారు.
“స్త్రీ పురుషుల వివాహ వయసుల మధ్య వ్యత్యాసం, లింగ సమానత్వ సూత్రాన్ని ఉల్లంఘిస్తుంది. ఇది మహిళ వివక్షకు దారితీస్తుంది. భారత్లో 21 ఏళ్ల వయసున్న పురుషుడు 18 ఏళ్లకు మహిళ వయసున్న మహిళ పెళ్లి చేసుకోవచ్చు. ఈ వ్యత్యాసం పితృస్వామ్య మూస పద్ధతులపై ఆధారపడి ఉంది. న్యాయపరమైన అసమానతలకు దారితీస్తుంది. ఇది మహిళలకు, ప్రపంచ పోకడలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉందని పిటిషనర్ వాదించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఇది పార్లమెంటుకు రిజర్వ్ చేయదగిన అంశమని పిటిషన్‌ను కొట్టివేసింది.
ఏకరూప చట్టాలపై విచారణ వాయిదా..
వివాహం, విడాకులు, వారసత్వం, భరణం వంటి అంశాలను నియంత్రించే విధంగా అన్ని మతాలకు ఏకరూప చట్టాలను రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్‌లు, పిటిషన్లపై సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. సోమవారం జరిగిన ఈ విచారణలో శాసనసభ పరిధిలోకి వచ్చే విషయాలలో కోర్టు ఎంతవరకు జోక్యం చేసుకోగలదని పేర్కొంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం చట్ట సభల పరిధిలోకి వచ్చే అంశాలు న్యాయపరమైన అధికారాల పరిధి గురించి పలు పరిశీలనలు చేసింది. దీనిపై దాఖలైన అనేక ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు సహా 17 పిటిషన్లపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. “ఈ అంశాలు చట్ట సభల పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఈ విషయాలలో కోర్టు ఎంతవరకు జోక్యం చేసుకోగలదనేది ప్రశ్న” అని న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ జేబీ పార్దీవాలాతో కూడిన ఈ ధర్మాసనం పేర్కొంది.